టీడీపీతో పొత్తు పెట్టుకోకుండా గత ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే బీజేపీ కచ్చితంగా 20 ఎమ్మెల్యే సీట్లు, 10 ఎంపీలు స్థానాలు గెలిచేదని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తెలిపారు. బుధవారం తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు పట్టం కట్టే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని ఆయన తెలిపారు.
అలాగని బీజేపీ కూడా ఆంధ్రప్రదేశ్‌లో పూర్తిస్థాయిలో గెలిచే అవకాశాలున్నాయని చెప్పలేమని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే టీడీపీ, కాంగ్రెస్‌తో జత కట్టే అవకాశముందని.. అయితే అది తన అనుమానమేనని ఆయన అన్నారు. ఈ నెల నుండే టీడీపీ, బీజేపీ నుండి వైసీపీలోకి భారీ స్థాయిలో వలసలు ఉండే అవకాశం ఉందని విష్ణుకుమార్ రాజు జోస్యం చెప్పారు. ముఖ్యంగా జగన్‌కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాపులారిటీ పెరుగుతుందని.. కానీ చంద్రబాబు ఉన్న పాపులారిటీ పోగొట్టుకుంటున్నారని ఆయన అన్నారు
రాబోయే ఎన్నికల్లో టీడీపీ ఒంటరిపోరు దిశగా వెళ్లేందుకు ప్రయత్నిస్తే నామరూప్లాలేకుండా పోతుందని.. తామైతే ఎవరితో పొత్తు పెట్టుకోవాలన్న విషయం అయితే ఇంకా ఆలోచించలేదని విష్ణుకుమార్ రాజు అన్నారు. అయితే చంద్రబాబు చేస్తున్న పోరాటం తమకు అనైతికంగా తోస్తుందని.. దానిని తాను సమర్థించనని పేర్కొన్నారు. కర్ణాటక ఎన్నికల విషయానికి వస్తే అక్కడ బీజేపీకి ఎదురులేదని తెలిపారు