పరిటాల రవి ప్రధాన అనుచరుడిగా గుర్తింపు పొందిన అనంతపురం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ చమన్ సోమవారం హఠాన్మరణం చెందారు. మొదట చమన్కు ఉన్నట్టుండి గుండెపోటు రావడంతో అనుచరులు అతడిని స్థానికంగా ఉన్న సవేరా అసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. పరిటాల రవికి అత్యంత సన్నిహితుడైన చమన్.. పరిటాల హత్య అనంతరం ఫ్యాక్షన్ పగల నేపథ్యంలో చాలాకాలంపాటు అజ్ఞాతంలోకి వెళ్లారు. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసి గెలుపొందడమేకాకుండా 2014 నుంచి 2017 వరకు అనంతపురం జిల్లా పరిషత్ చైర్మన్గా జిల్లాకు సేవలు అందించారు.
పరిటాల రవి కుటుంబంతో వున్న సాన్నిహిత్యంకొద్దీ రవి కుమార్తె వివాహ వేడుకల ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ గత మూడు రోజులుగా వెంకటాపురంలోనే ఉన్న చమన్ సోమవారం ఉన్నట్టుండి అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యారని తెలుసుకున్న మంత్రి పరిటాల సునీత హుటాహుటిన ఆస్పత్రికి బయల్దేరారు. అయితే, అప్పటికే చమన్ కన్నుమూశారన్న దుర్వార్త విన్న ఆమె అక్కడే కుప్పకూలిపోయారు. డాక్టర్ల ప్రాథమిక చికిత్సతో కోలుకున్న ఆమె అనంతరం చమన్కి నివాళి అర్పించి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. పరిటాల రవి హత్యకు ముందు, హత్య తర్వాత ఆ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా మెదిలినవారిలో చమన్ ఒకరు కావడంతో చమన్ మృతి పరిటాల కుటుంబాన్ని సైతం విషాదంలోకి నెట్టింది.