Munugode By Election: మునుగోడు ఉప ఎన్నిక సామాన్య జనాలకు ఉపాధిగా మారింది. పార్టీల ప్రచారాలు, బహిరంగ సభలు జనాలకు కూలీ కల్పిస్తోంది. వ్యవసాయ పనులకు వేళ్లే కూలీలు కొన్ని రోజులుగా పార్టీల పనికి వెళుతున్నారు. సభకు వెళ్లినా, ప్రచారానికి వెళ్లినా ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు. దీనికి మందు, బిర్యానీ అదనం. పురుషులకు నగదుతో పాటు బీరు, బిర్యానీ అందిస్తున్నారు. మహిళలకు కూల్ డ్రింక్స్ తో పాటు బిర్యానీ ఇస్తున్నారు. దీంతో సాగు పనుల కంటే ఇదే బాగుందంటూ పార్టీ మీటింగులకు ఉత్సాహంగా వెళుతున్నారు సామాన్య జనాలు. ఇతర పనులకు వెళితే రోజంతా కష్టపడాల్సి ఉంటుంది. కాని పార్టీల సభకు వెళితే ఐదారు గంటలే పని. అదికూడా పార్టీల వారు ఏర్పాటు చేసే వాహనాల్లోనే వెళతారు. అందుకే ఇతర కూలీ పనుల కంటే పార్టీల పనికే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు జనాలు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినప్పటి నుంచే మునుగోడు నియోజకవర్గంలో రాజకీయ వేడి మొదలైంది. రోజు ఏదో ఒక కార్యక్రమంలో పార్టీలు జనంలోకి వెళుతున్నారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా ప్రకటన చేసిన వెంటనే చండూరులో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ నిర్వహించింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాజరైన సభకు భారీగానే జన సమీకరణ చేశారు. మహిళా సంఘాలకు డబ్బులిచ్చి సమావేశానికి తరలించారు. తర్వాత సంస్థాన్ నారాయణపురం నుంచి చౌటుప్పల్ వరకు పీసీసీ నేతలు పాదయాత్ర చేశారు. ఈకార్యక్రమానికి కూడా జనాలను డబ్బులిచ్చి తరలించారు. ఈనెల20 శనివారం మునుగోడులో కేసీఆర్ ప్రజా దివెన సభ జరిగింది. కేసీఆర్ సభ కోసం నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి జనాలను తరలించారు. జనాల కోసం బస్సులు, ఆటోలు, కార్లు, వ్యాన్లు సమకూర్చారు. వాహనం ఎక్కగానే ఐదు వందల రూపాయలు చేతిలో పెట్టారట టీఆర్ఎస్ నేతలు. సభకు వెళ్లగానే బిర్యానీ ప్యాకెట్ తో.. తాగేవాళ్లకు మందు బాటిల్ ఇచ్చారని తెలుస్తోంది.
కేసీఆర్ సభకు ధీటుగా ఆదివారం సమరభేరీ సభ నిర్వహించింది బీజేపీ. అమిత్ షా హాజరైన సభకు కమలనాధులు భారీగా జనసమీకరణ చేశారు. టీఆర్ఎస్ తరహాలోనే నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి బీజేపీ సభకు జనాలను తరలించారు. బీజేపీ సభకు వెళ్లినవాళ్లకు కూడా ఐదు వందల రూపాయలతో పాటు బీరు, బిర్యానీ ఇచ్చారని తెలుస్తోంది. ఆదివారం పలు గ్రామాల్లో బోనాల పండుగ జరిగింది. అయినా సభకు వెళ్లాలనే ఉద్దేశ్యంతో ఉదయమే బోనాలు సమర్పించి కొందరు మహిళలు అమిత్ షా సభకు వెళ్లారని అంటున్నారు. పార్టీ కార్యక్రమాలకు జనాల తరలించడం నేతలకు ఈజీగా మారిందంటున్నారు. మహిళా సంఘాలకు సంబంధించి గ్రూప్ లీడర్ కు సమాచారం ఇస్తే చాలు.. వాళ్లే మహిళలను సభకు తీసుకువస్తున్నారని తెలుస్తోంది. సామాన్య జనాలతో పాటు పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా డబ్బులు ఇస్తేనే పార్టీ మీటింగులకు వస్తున్నారని చెబుతున్నారు.
ఇక్కడ మరో సమస్య కూడా వస్తోంది. సభకు వెళ్లగానే డబ్బులు ఇవ్వకపోయినా.. అనుకున్న దానికంటే తక్కువగా ఇచ్చిన ఆందోళనకు దిగుతున్నారు జనాలు. ఐదు వందల రూపాయలు ఇస్తామంటూ కేసీఆర్ సభకు తీసుకువెళ్లి తమకు ఇవ్వలేదంటూ చౌటుప్పల్ లో మహిళలు రోడ్డెక్కి నిరసన తెలిపారు. దీనికి సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో స్థానిక నేతలు వచ్చి.. వాళ్లకు డబ్బులు ఇచ్చి కూల్ చేశారు. బీజేపీ సభకు వెళ్లిన మహిళలు కూడా పలు ప్రాంతాల్లో తమకు ముందు చెప్పినట్లు కాకుండా తక్కువగా డబ్బులు ఇస్తున్నారంటూ నిరసనకు దిగారు. సభకు వెళ్లిన వారికి డబ్బుల పంపిణీకి సంబంధించి ఆడియో కాల్స్ లీకై వైరలా గా మారుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నికతో సామాన్యులకు ఉపాధి లభిస్తుందనే చర్చ సాగుతోంది. బైపోల్ పోలింగ్ జరిగే వరకు కూలీకు ఢోకా ఉండదని జనాలు చెప్పుకుంటున్నారు.
మరోవైపు వ్యవసాయ కూలీలంతా సాగు పనులు వదిలేసి.. పార్టీ సభలకు వెళుతుంటడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ పనులకు కూలీలు దొరకడం లేదని.. ఏం చేయాలో తమకు అర్ధం కావడం లేదని తలలు పట్టుకుంటున్నారు. సభకు వెళితే ఐదు వందల రూపాయలు, మందు. బీరు ఇస్తున్నారని.. అలా ఇస్తేనే వస్తామంటూ కొందరు కూలీలు డిమాండ్ పెడుతున్నారని తెలుస్తోంది. మొత్తంగా ఉప ఎన్నికతో మునుగోడు నియోజకవర్గంలో సందడి నెలకొంది. ఏ ఇద్దరు కలిసినా సభలు, ప్రచారాల గురించే మాట్లాడుకోవడం కనిపిస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి