Mission Bhagiratha: కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ సర్కార్ మధ్య వివాదం రోజురోజుకు పెరిగిపోతోంది. ప్రతి విషయంలోనూ ఇరు పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా జాతీయ స్థాయిలో వివిధ రంగాల్లో రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆవార్డుల విషయంలో రచ్చ సాగుతోంది. జాతీయ స్థాయిలో తెలంగాణ సర్కార్ కు పలు అవార్డులు వస్తున్నాయి. వీటిని గొప్పగా ప్రచారం చేసుకుంటుంది కేసీఆర్ సర్కార్. కేంద్ర మంత్రులు తెలంగాణకు వచ్చి టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన బాగా లేదని తిడుతున్నారని.. కాని జాతీయ స్థాయిలో అవార్డులు మాత్రం ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణకే ఎక్కువ వస్తున్నాయని గులాబీ నేతలు చెబుతున్నారు. అవార్డులను చూస్తే తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ నేతలు కావాలనే ఆరోపణలు చేస్తున్నారన్నది స్పష్టం అవుతుందని అంటున్నారు.
సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే మిషన్ భగీరథకు కేంద్ర ప్రభుత్వం అవార్డు వచ్చిందని రెండు రోజుల క్రితం తెలంగాణ సర్కార్ ప్రకటన ఇచ్చింది. ఈ విషయంలో మంత్రులు ఉత్సాహంగా స్పందించారు. మిషన్ భగీరథకు అవార్డు ఇచ్చినందుకు కేంద్రానికి థ్యాంక్స్ చెప్పారు కేటీఆర్. అవార్డుతో సరిపెట్టకుండా నీతి ఆయోగ్ సిఫారస్ చేసిన నిధులను ఇవ్వాలని కోరారు. మంత్రి హరీష్ రావు కూడా మిషన్ భగీరథకు అవార్డు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనకు ఈ అవార్డు నిదర్శనమని కామెంట్ చేశారు. అయితే మిషన్ భగీరథకు అవార్డు వచ్చిందని తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ నేతలు గొప్పగా ప్రచారం చేసుకుంటుంటే.. తాజాగా కేంద్ర సర్కార్ షాకిచ్చింది. మిషన్ భగీరథకు అసలు అవార్డే రాలేదని బాంబ్ పేల్చింది.
మిషన్ భగీరథకు జాతీయ అవార్డు ఇచ్చారనడం అబద్దమని కేంద్ర జల్ జీవన్ శాఖ ఒక ప్రకటనలో క్లారిటీ ఇచ్చింది. మిషన్ భగీరథ పథకాన్ని కేంద్రం అసలు అంచనా వేయనేలేదని తెలిపింది. తెలంగాణలో 100% నల్లా నీటి కనెక్షన్లు ఇచ్చినట్లు కేంద్రం ధ్రువీకరించలేదని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వమే 100 శాతం నల్లా నీటి కనెక్షన్లు ఇచ్చినట్లు కేంద్రానికి నివేదించిందని వెల్లడించింది. జల్ జీవన్ మిషన్ నిబంధనల ప్రకారం 100 శాతం నల్లా కనెక్షన్లు ఉన్నట్లు రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల ద్వారా తీర్మానాలు చేయాలని.. కానీ తెలంగాణ నుంచి పంచాయతీల ద్వారా ఇప్పటి వరకు ధ్రువీకరించలేదని వివరించింది. గ్రామీణ గృహాలకు నీటి సరఫరా విభాగంలో మాత్రమే అక్టోబరు 2న తెలంగాణ అవార్డుకు ఎంపికైందని జల్ జీవన్ శాఖ క్లారిటీ ఇచ్చింది. ఫంక్షనాలిటీ అసెస్మెంట్ డేటా ప్రకారం తెలంగాణలోని 409 గ్రామాల్లోని మొత్తం 12,570 గృహాలలో శాంపిల్స్ పరీక్షించగా, 8 శాతం నివాసాలు ప్రతిరోజు 55 లీటర్ల తలసరి నీటి కంటే తక్కువ తాగునీరు పొందుతున్నాయని తేలిందని తెలిపింది. మొత్త నమూనాల్లో 5 శాతం ఇళ్లలో నీటి నాణ్యత JJM నిబంధనల ప్రకారం లేదని గుర్తించింది.
మిషన్ భగీరథ పథకానికి కేంద్రం అవార్డు ఇచ్చిందని తెలంగాణ ప్రభుత్వం చెప్పుకుంటుండగా.. అలాంటిదేమి లేదని కేంద్ర జల్ జీవన్ మిషన్ తెలపడం మరో రచ్చగా మారే అవకాశం ఉంది. గ్రామీణ గృహాలకు నీటి సరఫరా విభాగంలో అవార్డు ఇచ్చామని కేంద్ర ఇచ్చిన క్లారిటీలో ఉంది. గ్రామీణ ప్రాంతాల్లోని నివాసాలకు నీటి సరఫరా జరుగుతున్నది మిషన్ భగీరథ పథకంలోనే అన్నది టీఆర్ఎస్ నేతల వాదన.
Also Read : KCR FIRE : పాలన బాగాలేదంటూ అవార్డులు ఎలా ఇస్తున్నారు.. కేంద్రాన్ని నిలదీసిన సీఎం కేసీఆర్
Also Read : Rahul Gandhi Bharath Jodo Yatra: 13 రోజులు.. 359 కిలోమీటర్లు! తెలంగాణలో రాహుల్ గాంధీ యాత్ర కుదింపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి