KKR vs SRH Qualifier 2 match in IPL 2018: చావో రేవో తేల్చుకోనున్న సన్ రైజర్స్ హైదరాబాద్

కోల్‌కతా నైట్ రైడర్స్‌ Vs సన్‌రైజర్స్ హైదరాబాద్

Last Updated : May 26, 2018, 01:13 PM IST
KKR vs SRH Qualifier 2 match in IPL 2018: చావో రేవో తేల్చుకోనున్న సన్ రైజర్స్ హైదరాబాద్

ఐపీఎల్ 2018లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా నేడు కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ టోర్నీలో చావో రేవో తేల్చుకునేందుకు సిద్ధమైంది. మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఈ రెండవ క్వాలిఫయర్ మ్యాచ్‌లో గెలిస్తేనే ఆదివారం జరిగే ఐపీఎల్ 2018 ఫైనల్‌కి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అర్హత సాధిస్తుంది. లేదంటే, ఇక్కడి నుంచి టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వుంటుంది. అటు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు పరిస్థితి కూడా ఇందుకు భిన్నమేమీ కాదు. ఐపీఎల్ 2018 విజయాల పట్టికలో టాప్ 4 జట్లలో మొదటి ర్యాంకులో వుంటూ వచ్చిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మొదటి క్వాలిఫయర్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓటమిపాలవడంతో నేరుగా ఫైనల్స్‌‌కి కాకుండా రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో తలపడాల్సిన పరిస్థితి తెచ్చుకుంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌పై గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు నేడు జరగనున్న రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌కి అర్హత సాధించిన సంగతి తెలిసిందే.

ప్రత్యర్థి చేతికి చిక్కబోయే విజయాన్ని ఎగరేసుకుపోయే పవర్‌ఫుల్ పర్‌ఫార్మర్స్ రెండు జట్లలోనూ ఉన్నారు. విచిత్రం ఏంటంటే, ఈ ఐపీఎల్ సీజన్‌లో మొదటిసారిగా ఏప్రిల్ 14న ఇదే ఈడెన్ గార్డెన్స్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కోల్‌కతాను ఢీకొంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన విలియమ్సన్ విజయం సైతం సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ దాదాపు నెల రోజుల తర్వాత, మే 19న హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడ్డాయి. 

ఈ మ్యాచ్ జరిగే సమయానికి హైదరాబాద్ జట్టు ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించగా, కోల్‌కతా నైట్ రైడర్స్ మాత్రం ప్లే ఆఫ్స్‌లో అర్హత సాధించేందుకు పాకులాడుతోంది. ఈసారి టాస్ గెలిచిన విలియమ్సన్ మ్యాచ్‌ని మాత్రం గెలుచుకోలేకపోయాడు. కోల్‌కతాలో సొంత గడ్డపై ఓడిపోయిన ప్రతీకారంతో వున్న కోల్‌కతా జట్టు ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టుని హైదరాబాద్ గడ్డపైనే ఓడించింది.

అలా రెండు జట్లు ప్రత్యర్థిపై పైచేయి సాధించిన రికార్డు వున్నవే. అయితే, ఆ రెండు మ్యాచ్‌ల గెలుపు-ఓటముల కన్నా నేడు రాత్రి 7 గంటల నుంచి జరగబోయే మ్యాచ్ ఫలితమే ఈ రెండింటికీ అత్యంత కీలకమైనది. ఎందుకంటే ఇక్కడ గెలిచిన వాళ్లే ఫైనల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆడేందుకు అర్హత సాధిస్తారు. లేదంటే ఇక తట్టాబుట్ట సర్దుకుని ఇంటి బాట పట్టాల్సిందే మరి. 

Trending News