ఎమ్మెల్యేలుగా గెలిచిన తమ శాసన సభ సభ్యత్వాలను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎస్.ఏ. సంపత్ కుమార్‌లు హై కోర్టు వేదికగా న్యాయపోరాటం చేస్తోన్న సంగతి తెలిసిందే. తమని ఎమ్మెల్యేలుగా పరిగణించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును తెలంగాణ ప్రభుత్వం అమలు చేయకుండా కోర్టు ధిక్కారానికి పాల్పడిందని జూన్ 12న ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు హై కోర్టులో కోర్టు ధిక్కారం నేరం కింద పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శిని ప్రతివాదులుగా చేర్చుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ పిటిషన్ దాఖలు చేశారు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ దాఖలు చేసిన ఈ పిటిషన్పైనేడు విచారణ చేపట్టిన హై కోర్టు.. అసెంబ్లీ కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. కోర్టు తీర్పు ధిక్కరణ పిటిషన్‌కు వివరణ ఇస్తూ అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా హై కోర్టు వారిని ఆదేశించినట్టు తెలుస్తోంది. అనంతరం తదుపరి విచారణను జూలై 13కు వాయిదా వేస్తున్నట్టు కోర్టు ప్రకటించింది.