రాజ్యసభ ఎంపీ సీఎం రమేశ్ ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. కడప స్టీల్ ఫ్యాక్టరీని సాధించడమే తన లక్ష్యమని.. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడమే తన అభిమతమని ఆయన తెలిపారు. ఈ రోజు కడప జిల్లా పరిషత్ కార్యాలయం బయట ఆయన బైఠాయించి నిరాహార దీక్షకు పూనుకున్నారు. ఈయనతో పాటు ఎమ్మెల్సీ బీటెక్ రవి కూడా దీక్షలో పాల్గొన్నారు.
ఈ దీక్ష ప్రారంభించడానికి ముందుగా సీఎం రమేశ్ మహాత్మాగాంధీ, ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పోట్లదుర్తి నుంచి తన అనుచరగణంతో భారీ ర్యాలీ ద్వారా జిల్లా పరిషత్ కేంద్రానికి చేరిన సీఎం రమేశ్.. ఆమరణ నిరాహార దీక్షకు శ్రీకారం చుడుతున్నట్లు మీడియాకి తెలిపారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ సాధన కోసం ఉద్యమించాల్సిన తరుణం వచ్చిందని తెలిపారు.
నిన్నే కడప స్టీల్ ఫ్యాక్టరీ సాధన కోసం వైసీపీ పార్టీ దీక్షలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలుగుదేశం నాయకుడు సీఎం రమేశ్ కూడా దీక్షకు దిగడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
రిత్విక్ ప్రాజెక్ట్స్ సంస్థకు ఎండీగా వ్యవహరిస్తోన్న సీఎం రమేశ్ గతకొంతకాలంగా తెలుగుదేశం రాజకీయాల్లో తనదైన పాత్రను పోషిస్తున్నారు. గండికోట ప్రాజెక్ట్‌తో పలు ఇతర ప్రభుత్వ ప్రాజెక్టులను గతంలో సీఎం రమేశ్ సంస్థే చేజిక్కించుకుంది. అలాగే 430 కోట్ల విలువైన కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు కూడా గతంలో ఇదే సంస్థ చేజిక్కించుకున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి.