అమెరికాలో తెలంగాణ విద్యార్థి కొప్పు శరత్‌పై కాల్పలు జరిపిన అనుమానితుడిని పోలీసులు కాల్చి చంపేశారు. అనుమానితుడిని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై దుండగుడు దాడికి దిగాడు. దీంతో పోలీసులకు, నిందితుడికి మధ్య ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఎదురుకాల్పుల్లో అనుమానితుడు మృతి చెందగా.. ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయని అమెరికా పోలీసు వర్గాలు సోమవారం ప్రకటించారు.
వరంగల్ వాసి అయిన కొప్పు శరత్ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి.. యూనివర్శటీ ఆఫ్ మిస్సోరీలో చదువుకుంటూ రెస్టారెంట్లో పార్ట్‌టైమ్ పని చేసుకుంటూ ఉండేవాడు. జులై 6వ తేదీన కేన్సస్‌లోని ఓ రెస్టారెంట్లో దోపిడీకి వచ్చిన దుండగుడు తుపాకీతో కాల్పులు జరపడంతో శరత్ చనిపోయాడు. దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఆతరువాత అనుమానితుడికి సంబంధించి సీసీ కెమెరా దృశ్యాలను విడుదల చేసిన పోలీసులు అతడి కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో అనుమానితుడు పోలీసుల కంటపడ్డాడు. పోలీసులు చుట్టుముట్టగా.. అతడు వారిపై కాల్పులకు తెగబడ్డాడు. ఎదురుకాల్పులు చోటుచేసుకోవడంతో అనుమానితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే అనుమానితుడి పేరు, వివరాలను పోలీసులు వెల్లడించలేదు.