భారత్‌లో ఎన్నో సమస్యలు వున్నాయి: అమెరికా మీడియాతో పవన్ కల్యాణ్

దేశంలో ఎన్నో సమస్యలు వున్నాయి, ఎన్నో విబేధాలు వున్నాయి : అమెరికాలో పవన్ కల్యాణ్   

Updated: Dec 18, 2018, 02:40 PM IST
భారత్‌లో ఎన్నో సమస్యలు వున్నాయి: అమెరికా మీడియాతో పవన్ కల్యాణ్

''భారత్ భిన్నత్వంలో ఏకత్వం కలిగిన గొప్ప దేశం. ప్రపంచంలోనే ప్రజాస్వామ్యం కలిగినఅతిపెద్ద దేశమైన భారత్‌లో ఎన్నో భాషలు, యాసలు మాట్లాడే జనం వున్నారు. అంతా కలిసే వున్నప్పటికీ కొన్నిచోట్ల వారి మధ్యే ఎన్నో బేధాభిప్రాయాలు వున్నాయి. ఎన్నో ప్రాంతీయ, మత విభేదాలు వున్నాయి. పలు ప్రాంతాలు వెనుకబాటుకు, నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. ఆ సమస్యలపై దృష్టిసారించి, అందరూ సమానమే అని చెప్పడంతోపాటు దేశ ఔన్నత్యాన్ని చాటాలనేదే తన ప్రయత్నం'' అని అన్నారు పవన్ కల్యాణ్. ప్రస్తుతం అమెరికా పర్యటనలో వున్న ప్రముఖ సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అక్కడ ది డైలీ సిగ్నల్ అనే మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులు, అమెరికా-భారత్ ద్వైపాక్షిక సంబంధాలు, అమెరికా-చైనా దేశాల మధ్య వున్న విభేదాలు వంటి అంశాలెన్నో ఈ ఇంటర్వ్యూలో చర్చకు రాగా పవన్ కల్యాణ్ ఆయా అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు.

పవన్ కల్యాణ్‌తో కలిసి ఇదే ఇంటర్వ్యూలో పాల్గొన్న జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ సైతం పవన్ వ్యాఖ్యలకు మద్దతు పలుకుతూ ''పవన్ తన సినిమాల్లో చేసి చూపెట్టిన అంశాల్ని ఇప్పుడు నిజ జీవితంలో నిజం చేసేందుకు కృషి చేస్తున్నారు'' అని అన్నారు. సోషల్ మీడియాలో పవన్ కల్యాణ్‌కి వున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ద్వారా ఆయన తన ఐడియాలజీని, ప్రజా సంక్షేమం కోసం చేస్తున్న కృషిని జనంలోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారని నాదెండ్ల పేర్కొన్నారు.