అమెరికాలో తెలంగాణ వ్యక్తిని కాల్చి చంపిన.. 16 ఏళ్ల కుర్రాడు

  

Updated: Nov 18, 2018, 03:40 PM IST
అమెరికాలో తెలంగాణ వ్యక్తిని కాల్చి చంపిన.. 16 ఏళ్ల కుర్రాడు
Sunil Edla (Pic courtsey: facebook.com/sunil.edla1)

తెలంగాణ ప్రాంతంలోని మెదక్ జిల్లాకి చెందిన సునీల్ ఎడ్ల.. గతకొంత కాలంగా అమెరికాలోని న్యూజెర్సీలో ఉద్యోగం చేస్తున్నారు. శనివారం సాయంత్రం ఆయన తన డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్తుండగా.. ఓ దుండగుడు సునీల్‌ను పిస్తోల్‌తో కాల్చి వెంటనే కారులో ఉడాయించాడు. న్యూజెర్సీలోని వెంట్నర్ సిటీలో రాత్రి 8 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సునీల్ అమెరికాలోని అట్లాంటిక్ సిటీలో నైట్ ఆడిటర్‌గా పనిచేస్తున్నారు. దుండగుడు సునీల్‌ను కాల్చగానే ఆయన స్పాట్‌లోనే మరణించినట్లు సమాచారం.

సునీల్ దేహాన్ని పోలీసులు ఆసుపత్రికి తరలించి.. ఆ తర్వాత హంతకుడి వేటలో పడ్డారు. సీసీ టీవీ కెమెరాల ద్వారా నేరస్తుడి కదలికలను గమనించారు. తర్వాత నేరస్తుడిని ట్రాక్ చేసి పట్టుకున్నారు. హత్య చేసిన దుండగుడు కేవలం 16 సంవత్సరాల కుర్రాడని తెలుసుకొని ఆశ్చర్యపోయారు. అయితే ఏ కారణంతో ఆ కుర్రాడు సునీల్‌ను హత్య చేశాడన్న విషయంపై పోలీసులు ఎలాంటి సమాచారమూ మీడియాకి అందివ్వలేదు. అయితే ఆ కుర్రాడిపై పలు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. 

ఈ ఘటనలో మరణించిన వ్యక్తి సునీల్ 1987లో అమెరికాకి వెళ్లారు. అక్కడే స్థిరపడ్డారు. ఇంకో రెండు నెలల్లో ఆయన తన తల్లి 95వ జన్మ దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి భారత్ రానున్నారు. అలాగే క్రిస్మస్ వరకూ ఇండియాలోనే ఉండేటట్లు ట్రిప్ ప్లాన్ చేసుకున్నారని సునీల్ స్నేహితులు చెబుతున్నారు. సునీల్ అమెరికాలోని పలు సామాజిక కార్యక్రమాల్లో విరివిగా పాల్గొనేవారు. అట్లాంటిక్ సిటీ ప్రాంతంలోని కొన్ని చర్చిల్లో సునీల్ కొన్నాళ్లు పియానో కూడా వాయించేవారని.. ఆయనకు ఆ ప్రాంతంలో చాలామంది పరిచయస్తులు ఉన్నారని సునీల్ కొలీగ్స్ అంటున్నారు.