New Lady Of Justice Statue: ఇన్నాళ్లు న్యాయదేవత అంటే కళ్లకు గంతలు కట్టుకుని ఉండేది. ఇప్పుడు న్యాయ దేవత కళ్లు తెరచుకుంది. సుప్రీంకోర్టు గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు కొత్త విగ్రహం న్యాయస్థానంలో కొలువుదీరింది. ఆ విశేషాలు ఏమిటో తెలుసుకుందాం.
భారతదేశంలో న్యాయ దేవత విగ్రహం కళ్లకు గంతలు ఉండేవి. ఇప్పుడు న్యాయదేవత కళ్లు తెరచుకుంది.
దేశ అత్యున్నత న్యాయస్థానం న్యాయదేవతకు కళ్లు ఉండాలని నిర్ణయించింది. ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఆదేశాలతో సుప్రీంకోర్టులో కొత్తగా న్యాయదేవత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
గతంలో న్యాయ దేవత కుడి చేతిలో న్యాయానికి ప్రతిబింబంగా నిలిచే త్రాసు, ఎడమ చేతిలో ఖడ్గం ఉండేవి.
కొత్తగా ఏర్పాటుచేసిన న్యాయ దేవత విగ్రహం కుడి చేతిలో త్రాసు అలాగే ఉంచి ఎడమ చేతిలో ఖడ్గానికి బదులుగా రాజ్యాంగం ఉంచారు.
ప్రస్తుతానికి సుప్రీంకోర్టులోని జడ్జీల లైబ్రరీలో ఈ విగ్రహాన్ని ఉంచారు. న్యాయం గుడ్డిది కాదని.. చట్టానికి కళ్లున్నాయని బలమైన సంకేతమిచ్చే ఉద్దేశంతో న్యాయదేవత విగ్రహంలో సుప్రీంకోర్టు మార్పులు చేసింది.
న్యాయదేవత విగ్రహం కళ్లకు గంతలు కట్టడం వెనుక ఒక గొప్ప ఉద్దేశం ఉంది. చట్టం ముందు అందరూ సమానమే.. న్యాయస్థానం డబ్బు, అధికారం.. ఇతర హోదాను చూడదు అనే సందేశంతో విగ్రహానికి గంతలు కట్టి ఉండేవి.
ఇక ఖడ్గం విషయానికి వస్తే అన్యాయాన్ని న్యాయదేవత చీల్చిచెండాడుతుందని సంకేతం ఇచ్చేందుకు చేతిలో ఖడ్గం ఉండేది.
కాగా కొత్త న్యాయ దేవత విగ్రహం కిరీటం, ఆభరణాలతో భారతమాత రూపంలో ఉండడం విశేషం. ఈ విగ్రహానికి ఆమోదం లభిస్తే దేశవ్యాప్తంగా ఇదే విగ్రహాన్ని అన్ని న్యాయస్థానాల్లో ఏర్పాటుచేసే అవకాశం ఉంది.
కళ్లు తెరచిన న్యాయ దేవత ఇకనైనా బాధితులకు న్యాయం దక్కేలా ఉండాలని.. పేదలకు న్యాయం చేరువ కావాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.