ఇంట్లో చార్జింగ్ పెట్టిన ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ అకస్మాత్తుగా పేలిన ఘటన చైనాలో చోటుచేసుకుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ చార్జింగ్‌కి పెట్టిన ఓ వ్యక్తి, దానికి సమీపంలోనే తన కూతురుతోపాటు టీవీ చూస్తూ రిలాక్స్ అవుతుండగా ఈ ఘటన జరిగింది. చార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ స్కూటర్ నుంచి మొదట చిన్నపాటి పేలుడు శబ్ధం రావడంతో దానిపక్కనే కూర్చుని ఉన్న పెంపుడు కుక్క వెంటనే అక్కడి నుంచి జారుకుంది. చిన్న పేలుడు శబ్ధం వచ్చిన అనంతరం అందులోంచి పొగలు రావడం గమనించిన ఆ వ్యక్తి వెంటనే లేచి వెళ్లి చార్జింగ్ ప్లగ్ తీసేసినప్పటికీ ఆ స్కూటర్ పొగలు కక్కడం మానలేదు. దీంతో తన కూతురిని తీసుకుని ఇంట్లోంచి బయటికి పరిగెత్తాడు ఆ వ్యక్తి.
తండ్రీ, కూతుళ్లు అలా అక్కడి నుంచి పరిగెత్తిన మరుక్షణమే ఆ స్కూటర్ ఒక్కసారిగా పేద్ద శబ్ధం చేస్తూ పేలిపోయింది. ఇంట్లో ఉన్న సీసీటీవీ కెమెరాలో ఈ పేలుడు ఘటన రికార్డ్ కాగా సదరు పేలుడు దృశ్యాన్ని ఓ వ్యక్తి మంగళవారం ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఆ పేలుడు దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడమే కాకుండా ఎలక్ట్రిక్ వస్తువుల పట్ల ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని మరోసారి గుర్తుచేసింది.