ఫేస్‌బుక్ ఖాతాలో లాగిన్ అయి.. ఊరికే ఇతరులు చేసిన పోస్టులను చూస్తున్నారా? మీరేమీ పోస్టులు, మెసేజ్‌లు చేయటం లేదా? అయితే మీకు జబ్బు ఉన్నట్లే. ఈ విషయాన్ని మేము కాదు.. స్వయానా ఫేస్‌బుక్ కంపెనీయే ఒప్పుకుంది.
వివరాల్లోకి వెళితే.. ఫేస్‌బుక్‌లో ఎటువంటి మెసేజ్‌లు, పోస్టులు చేయకుండా, ఊరికే అకౌంట్‌లో లాగిన్ అయి ఇతరులు చేసిన పోస్టులను చూస్తూ ఉంటే మానసిక ఆరోగ్యంపై దుష్ప్రభావం ఉంటుందని ఫేస్‌బుక్ యాజమాన్యం మొదటిసారి అంగీకరించింది. ఈ విషయాన్ని వెల్లడించడానికి ఫేస్‌బుక్ రెండు పరిశోధనలు చేసింది.
మొదటి పరిశోధనను అమెరికాలోని మిచిగాన్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులపై జరిపారు. ఇందులో వారు ఎంపిక చేసుకున్న విద్యార్థులలో కొందరికి 10 నిమిషాలపాటు ఫేస్‌బుక్ చూడమని చెప్పారు. మరికొందరికి మెసేజ్‌లు, పోస్టులు చేయాలని చెప్పారు. అయితే ఈ పరిశోధన ద్వారా చివరికి తెలిసిందేమిటంటే... పోస్టులు చేసేవారికన్నా.. పోస్టులు చూస్తూ కూర్చున్నవారే నిరుత్సాహంగా కనిపించారు. కాలిఫోర్నియా, యేల్ యూనివర్సిటీ సంయుక్తంగా చేసిన మరో పరిశోధన.. 'ఎక్కువగా ఇతరుల ఫేస్‌బుక్ చూసేవారి మానసిక ఆరోగ్యం బాగుండదు' అని తేల్చిచెప్పింది.