ఫేస్‌బుక్ స్టాండ్ ఎలోన్ ఫీచర్‌గా ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ మొబైల్స్ వాడుతున్న యూజర్ల కోసం "లోకల్" అనే యాప్ త్వరలో రానుంది. స్థానిక వ్యాపారసంస్థలను ప్రమోట్ చేయడానికి ఈ యాప్ ఉపయోగపడుతుంది. రెస్టారెంట్లు, బార్లు, హోటళ్లు, రిస్టార్స్ మొదలైన వాటి వివరాలు ఈ యాప్ ద్వారా పొందచ్చు. ప్రస్తుతం కొన్ని దేశాల్లో మాత్రమే ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ యాప్ త్వరలో అన్ని దేశాలకు కూడా అందుబాటులోకి రానుంది. లోకల్ బిజినెస్ చిరునామాలను, వాటిపై కస్టమర్ల సమీక్షలను కూడా ఈ యాప్‌లో చూడవచ్చు. ప్రస్తుతం ఫేస్‌బుక్‌లోనే ఈవెంట్స్ పేరుతో ఓ అప్లికేషన్ ఉంది. దానిని రీడిజైన్ చేస్తూ ఈ యాప్ ప్రారంభించింది సంస్థ. ఫోర్ స్క్వేర్, యల్ప్ లాంటి యాప్స్‌కు పోటీగా ఈ యాప్ మార్కెట్‌లోకి రానుంది. అలాగే పలు ఆన్‌లైన్ ఎల్లో పేజీ వెబ్‌సైట్స్‌కు ఈ యాప్ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఈ మధ్యకాలంలో ఫేస్‌బుక్ ఎక్కువగా ప్రయోగాత్మకమైన ఫీచర్లకు శ్రీకారం చుట్టింది. అందులో ఈ లోకల్ యాప్ కూడా ఒకటి. త్వరలో ఫేస్‌బుక్ ద్వారా డబ్బులు పంపించే సౌలభ్యాన్ని కలిగించే "రెడ్ ఎన్వలప్", తాజా వార్తా కథనాలను అందించే "బ్రేకింగ్ న్యూస్" ఫీచర్లను కూడా ఈ సంస్థ ప్రారంభించనున్నట్లు సమాచారం.