Turbulence on Air China Flight : చైనాకు చెందిన అధికారిక విమానయాన సంస్థకు చెందిన ఎయిర్ చైనా విమానంలో తాజాగా తీవ్ర అల్లకల్లోలం చోటుచేసుకుంది. ఈ అల్లకల్లోలం ధాటికి ఒక ప్రయాణికుడు తాను కూర్చున్న సీటులోంచి గాల్లోకి ఎగ్గిరిపడ్డాడు. ఈ క్రమంలో అతడు ఫ్లైట్ రూఫ్‌కి సైతం టచ్ అయ్యాడని తెలుస్తోంది. ఈ ఎయిర్ టర్బలెన్స్‌కి చెందిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది.
షాంఘై - బీజింగ్ మధ్య రాకపోకలు సాగించే ఎయిర్ చైనా విమానంలో జూలై 10, 2023న ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో చాలా మంది ప్రయాణికులు, విమానంలో పనిచేసే సిబ్బంది గాయపడ్డారు. ట్విట్టర్‌లో బ్రేకింగ్ ఏవియేషన్ న్యూస్ & వీడియోస్ అంటే ట్విటర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన ఈ వీడియోను వీక్షిస్తే.. ఎయిర్ చైనా ఫ్లైట్ CA1524 విమానం గాల్లో ఉండగానే ఒక్కసారిగా అల్లకల్లోలానికి గురైంది. దీంతో విమానం ఒక్కసారిగా కుదుపులకుగురైంది. అదే సమయంలో ఒక ప్రయాణికుడు వెనుక నుంచి ఈ వీడియోను రికార్డు చేశారు. అల్లకల్లోలం కారణంగా వారు సరిగ్గా ఈ వీడియోను రికార్డు చేయలేకపోయారని వీడియో షేక్ అయి ఆగిపోయిన తీరు చూస్తే అర్థమవుతుంది.
ఈ దృశ్యాన్ని పరిశీలిస్తే.. సీటులో కూర్చున్న ప్రయాణికుడు సీటులో నుండి గాల్లోకి ఎగిరి పైకప్పుపైకి తగిలి మళ్లీ కిండపడ్డాడు. ఆ ప్రయాణీకుడు సీటు బెల్ట్ ధరించకపోవడం వల్లే గాల్లోకి ఎగిరిపడ్డాడని.. ఒకవేళ అందరు ప్రయాణికుల తరహాలోనే అతడు కూడా సీట్ బెల్ట్ ధరించి ఉంటే అందరిలాగే తన సీటులోనే భద్రంగా ఉండేవాడు అని విమానం సిబ్బంది తెలిపారు.
విమానంలో ఎప్పుడైనా అల్లకల్లోలం సంభవించే అవకాశాలు ఉంటాయనే ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ప్రయాణికులు విమానం ఎక్కగానే వారిని సీటు బెల్ట్ ధరించమని విమాన సిబ్బంది హెచ్చరిస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా విమానం గాల్లోకి టేకాఫ్ అయ్యే ముందు క్యాబిన్ క్రూ ప్రయాణికులకు ఒక 5 నిమిషాలు కేటాయించి సీటు బెల్ట్ ధరించడం నుంచి అత్యవసర సమయంలో లైఫ్ జాకెట్స్ ఎలా ఉపయోగించాలి, అలాగే ఆక్సిజెన్ మాస్క్ ఎలా ఉపయోగించాలి అనేవి అన్నీ వివరిస్తారు.
Passenger and flight attendant injured after Air China flight hit severe turbulence between Shanghai and Beijing. pic.twitter.com/AGiZ6mp4lt
— Breaking Aviation News & Videos (@aviationbrk) July 11, 2023
టర్బులెన్స్ కారణంగా విమానం కుదుపులకు గురవడం అప్పుడప్పుడూ చూస్తూంటాం. వాతావరణంలో మార్పులు దీనికి ఒక కారణం అయినప్పటికీ.. అదొక్కటే కాకుండా ఇంకా ఎన్నో కారణాలు ఉంటాయి. విమానం అల్లకల్లోలానికి గురైనప్పుడు విమానం కుదుపులకు గురవుతుంది. అలాంటప్పుడు సీటు బెల్ట్ ధరించని వారు విమానం ఎటువైపు ఒంగితే అటువైపు పడిపోయే ప్రమాదం ఉంటుంది. ఇటీవల కాలంలో తయారవుతున్న విమానాల్లో అత్యాధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. ఫలితంగా అల్లకల్లోలం ఎదురైనప్పుడు విమానం కుదుపులకు గురవకుండా తట్టుకుని నిలబడే శక్తి విమానానికి ఉంటుంది.