బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఈ మధ్య కాలంలో నీర్ అనే పేరుతో తనవద్దకు వచ్చే కొన్ని కథలను, విశేషాలను ఫేస్బుక్ ద్వారా పంచుకుంటున్నారు. ఈ రోజు కూడా తన ఫేస్బుక్ పేజీలో అలాంటి ఓ ఆసక్తికరమైన కథనే పోస్టు చేశారు. ఈ కథలో దశరథుడు తన కోడళ్లు గర్భంతో ఉన్నప్పుడు, తానే స్వయంగా వారిని రథాన ఎక్కించుకొని, ఎన్నో కానుకలతో వైభవంగా వారి పుట్టిల్లైన జనకగృహానికి తీసుకొని వెళ్తాడు .దశరథుడిని చూసిన జనకుడు వెంటనే దిగి వచ్చి స్వాగతం పలుకుతాడు. అప్పుడు దశరథుడు జనకుడికి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. దానికి జనకుడు "అయ్యో.. మహారాజా. మీరు నాకంటే పెద్దవారు.. వయసు రీత్యా మరియు రాజ్యం రీత్యాకూడా. అలాంటి మీరు నా పాదాలపై పడి నన్ను క్షంతవ్యుడిని చేయకండి" అంటాడు. అప్పుడు దశరథుడు ఇలా బదులిస్తాడు.
"మిత్రమా.. సంస్కారవంతులైన మేలిమి ముత్యాల వంటి ఆడపిల్లలను కనిపెంచి, యుక్తవయసు వచ్చినప్పుడు నా కుమారులకు వారిని కన్యాదానం చేశారు. ఆ రకంగా మీరు దాత. వారిని నా ఇంటి కోడళ్లుగా చేసుకున్న నేను యాచకుడిని. ఏ సంప్రదాయంలో చూసుకున్నా... యాచకుడే దాతకు రుణపడి ఉంటాడు. అందుకే మీకున్న రుణానికి ప్రతిఫలంగా ఈ సాష్టాంగ నమస్కారం" అంటాడు దశరథుడు. ఆ మాటలకు జనకుడు కన్నీళ్లు పెట్టుకుంటాడు. అవును.. నిజమే.. పుత్రికల భాగ్యము నందు తండ్రి పాత్ర తప్పకుండా ఉంటుంది.. కానీ ఎంతమంది తండ్రులు నిజంగానే పుత్రికల మూలంగా తమ భాగ్యా్న్ని పొందగలుగుతున్నారు అని ఆలోచనలో పడతాడు అతను.
<
>