Telangana, AP Weather Updates: మండు వేసవిలో వర్షాకాలం.. రైతులకు టెన్షన్ టెన్షన్

Telangana, AP Weather Updates: భారత వాతావరణ విభాగం శనివారం వెల్లడించిన నివేదికల ప్రకారం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో రానున్న ఐదు రోజులపాటు అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని తెలుస్తోంది. భారత వాతావరణ విభాగం జారీచేసిన లేటెస్ట్ వెదర్ బులెటిన్‌లో ఈ కీలక వివరాలు వెల్లడించింది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 23, 2023, 05:12 PM IST
Telangana, AP Weather Updates: మండు వేసవిలో వర్షాకాలం.. రైతులకు టెన్షన్ టెన్షన్

Telangana, AP Weather Updates: న్యూఢిల్లీ: మండుతున్న ఎండవేడికి తిప్పలు పడుతున్న వారికి ఓ గుడ్ న్యూస్. ఎండాకాలం మండు వేసవి నుంచి తాత్కాలిక ఊరట లభించనుంది. భారత వాతావరణ విభాగం శనివారం వెల్లడించిన నివేదికల ప్రకారం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో రానున్న ఐదు రోజులపాటు అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని తెలుస్తోంది. భారత వాతావరణ విభాగం జారీచేసిన లేటెస్ట్ వెదర్ బులెటిన్‌లో ఈ కీలక వివరాలు వెల్లడించింది. 

తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఏప్రిల్ 23న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, పుదుచ్చేరిలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. రాబోయే 4 రోజుల్లో తూర్పు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలతో పాటు మహారాష్ట్రలోని విదర్భలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. 

ఏప్రిల్ 24న విదర్భలో అక్కడక్కడా వడగళ్లతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మధ్య మహారాష్ట్రతో పాటు మరాఠ్వాడాలో ఏప్రిల్ 24వ తేదీ నుంచి ఏప్రిల్ 26వ తేదీ వరకు ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. రాబోయే 24 గంటల్లో రాజస్థాన్‌లో తప్పించి మిగతా వాయువ్య భారత్‌లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి జల్లులు కురిసే అవకాశాలు ఉన్నాయి అని భారత వాతావరణ శాఖ తమ వెదర్ బులెటిన్‌లో పేర్కొంది. 

ఏప్రిల్ 23న ఆదివారం దక్షిణ హర్యానా, ఈశాన్య రాజస్థాన్, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో తుఫాను వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ కారణంగానే మరో ఐదు రోజుల పాటు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఎండవేడి నుంచి ఉపశమనం లభించనుంది అని వాతావరణ విభాగం స్పష్టంచేసింది. ఇప్పటికే భరించలేని ఎండవేడితో అల్లాడిపోతున్న జనానికి భారత వాతావరణ విభాగం అందించిన ఈ తీపి కబురు వర్షాలు పడకముందే భారీ ఉపశమనం అందిస్తోంది.

ఇదిలావుంటే, మండు వేసవి నుంచి సాధారణ ప్రజానికానికి వర్షాలు, జల్లుల రూపంలో ఊరట లభించనున్నప్పటికీ.. ఈ అకాల వర్షాలు దేశానికి అన్నం పెట్టే అన్నదాతలకు మాత్రం ఆందోళనకు గురిచేస్తున్నాయి. వరి చేన్లలో పంట చేతికొచ్చే సమయంలో కురిసే ఈ అకాల వర్షాలు తమను ఏం చేస్తాయోననే ఆందోళన రైతన్నల్లో కనిపిస్తోంది. ఇప్పటికే చాలా చోట్ల వరికోతలు చేపట్టిన వారికి వడ్లు కల్లంలోనో లేక మార్కెట్ యార్డుల్లోనూ ఉండగా.. ఇంకా చాలా చోట్ల వరిచేన్లు కోతకు సిద్ధంగా ఉన్నాయి. ఇలాంటి తరుణంలో వర్షాలు కురిస్తే మిగిలే నష్టం ఊహకందదు అనే రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

Trending News