2018 ఆసియా క్రీడలు: భారత్‌కి 8వ గోల్డ్ మెడల్.. 36 ఏళ్ల తర్వాత అందిన విజయం.. చరిత్ర సృష్టించిన నీరజ్ 

భారత్‌ ఖాతాలో మరో గోల్డ్ మెడల్

Last Updated : Aug 28, 2018, 01:33 PM IST
2018 ఆసియా క్రీడలు: భారత్‌కి 8వ గోల్డ్ మెడల్.. 36 ఏళ్ల తర్వాత అందిన విజయం.. చరిత్ర సృష్టించిన నీరజ్ 

భారత్ ఖాతాలో మరో గోల్డ్ మెడలో వచ్చిచేరింది. 2018 ఆసియా క్రీడల్లో భారత్ నేడు మరో గోల్డ్ మెడల్ సొంతం చేసుకుంది. జావెలిన్ థ్రోలో నీరజ్ చోప్రా కైవసం చేసుకున్న బంగారు మెడల్ తో భారత్ గెల్చుకున్న గోల్డ్ మెడల్స్ సంఖ్య 8కి చేరింది. 
నీరజ్ చోప్రా విసిరిన తొలి థ్రోలోనే జావెలిన్ వెళ్లి 83.46 మీటర్ల దూరంలో పడింది. ఆ తర్వాత నీజర్ విసిరిన రెండు, ఆరవ జావెలిన్ థ్రోలు ఫౌల్ అయ్యాయి. నీజర్ విసిరిన 3వ థ్రో 88.06 మీటర్ల దూరంలో పడగా 4వ థ్రో 83.25 దూరంలో పడింది. ఇక 5వ థ్రో 86.36 మీటర్ల దూరాన్ని చేరుకుంది. 

అయితే, ఈ పోటీల్లో నీరజ్‌తో తలపడిన క్రీడాకారుల్లో చైనుకు చెందిన లీ ఖిజెన్ కేవలం 82.22 మీటర్లు మాత్రమే విసరగలిగాడు. దీంతో నీరజ్ తాను విసిరిన మొదటి థ్రోతోనే గోల్డ్ మెడల్ సొంతం చేసుకోవడం విశేషం. ఆ తర్వాత 82.22 మీటర్లు విసిరిన లీ ఖిజెన్ 2వ స్థానంలో, పాకిస్తాన్‌కి చెందిన అర్షద్ నదీం 80.75 మీటర్ల లక్ష్యంతో మూడో స్థానంలో నిలిచారు.  

ఈ విజయంతో నీరజ్ చోప్రా మరో ఖ్యాతిని కూడా సొంతం చేసుకున్నాడు. 1982 తర్వాత ఆసియా క్రీడల చరిత్రలో భారత్‌కి జావెలిన్ థ్రోలో తొలిసారిగా పతకం అందించిన క్రీడాకారుడిగా నీరజ్ చరిత్ర సృష్టించాడు. 1982లో భారత్ తరపున ఆసియా క్రీడల్లో జావెలిన్ థ్రోలో గురుతేజ్ సింగ్ కాంస్య పతకం గెలుచుకున్నాడు. ఆ తర్వాత ఆసియా క్రీడల్లో జావెలిన్ థ్రోలో భారత్ మళ్లీ పతకం గెలుచుకోవడం ఇదే మొదటిసారి. అది కూడా ఏకంగా బంగారు పతకం కావడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.

Trending News