ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రకే రారాజు

    

Last Updated : Oct 26, 2017, 04:10 PM IST
ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రకే రారాజు
అతను పుట్టి పెరిగింది ఆర్జెంటీనా అయినా.. ప్రపంచంలోని ఫుట్‌బాల్ అభిమానులందరికీ అతనెవరో తెలుసు.. ఎందరో ఫుట్‌బాల్ క్రీడాకారులు అతన్ని ఆరాధ్య దైవంగా కొలుస్తారు.. ఫుట్‌బాల్‌ క్రీడలో అలుపెరగని దిగ్గజం పీలేతో పాటు శతాబ్ది పురస్కారం అందుకున్న ఆయన.. ప్రపంచ ఫుట్‌బాల్ క్రీడాకారుల్లో రారాజు అన్నదగ్గ వ్యక్తి. ఆయనే డిగో మారడోనా... నేటితో మారడోనా ఫుట్‌బాల్ క్రీడ నుండి రిటైర్మెంటయ్యి 20 సంవత్సరాలు కావస్తోంది. ఈ సందర్భంగా గ్రేటెస్ట్ లెజెండ్ మారడోనా జీవితానికి సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలు మీకోసం..
 
  • 30 అక్టోబరు 1960 తేదీన బ్యూనోస్ ఎరిస్ ప్రాంతంలో ఒక పేద కుటుంబంలో పుట్టి పెరిగిన డిగో మారడోనా ఎనిమిదేళ్ళ వయసులోనే ఫుట్‌‌బాల్ ఆడుతూ, ప్రాంతీయ క్లబ్ అయిన ఎస్తెల్లా రోజా సెలెక్టర్ల కళ్ళల్లో పడ్డాడు. ఆ క్లబ్‌ తరఫున జూనియర్ మ్యాచ్‌ల్లో పాల్గొన్నాడు. 12 ఏళ్ళు వచ్చేసరికి ఫస్ట్ డివిజన్ గేమ్స్‌లో తన సత్తా చాటాడు. ముఖ్యంగా, అతని పరుగు వేగం ప్రేక్షకులను ఎంతగానో అబ్బురపరిచేది. ఒకసారి  గ్రౌండ్‌లో అడుగుపెడితే చాలు.. అతని కదలికల్లోని మెరుపు వేగం ఫుట్‌బాల్ అభిమానులను కట్టిపడేసేది.
  • 20 అక్టోబరు 1976 తేదీన మారడోనా, తొలిసారిగా ప్రొఫెషనల్ క్రీడాకారుడిగా ఆర్జెంటీనోస్ జూనియర్స్ తరఫున ఆడాడు. దాదాపు అయిదు సంవత్సరాలు అదే జట్టు తరఫున ఆడాడు. ఆ జట్టు విజయాలలో ప్రధాన పాత్ర కూడా పోషించాడు. 
  • ఆర్జెంటీనోస్ జూనియర్స్ తరఫున 167 సార్లు ఆడిన మారడోనా, అదే క్లబ్ తరఫున 115 గోల్స్ చేశాడు. తర్వాత ఎన్నో క్లబ్స్ నుండి తనకు ఆఫర్లు వెలువెత్తాయి. అయినా తన అభిమాన జట్టైన బోకా జూనియర్స్‌కు ఆడడం కోసం అవన్నీ వదులుకున్నాడు మారడోనా. అప్పట్లోనే ఆ జట్టు మారడోనాకి దాదాపు 4 మిలియన్ డాలర్లు ఆఫర్ చేసింది.

  • బోకా జూనియర్స్‌కు ఆడిన తర్వాత బార్సిలోనా, నెపోలీ, సెవిల్లా, నేవెల్స్ ఓల్డ్ బాయ్స్ లాంటి అనేక క్లబ్బులకు ఆడారు మారడోనా.
  • ఆ తర్వాత జాతీయ ఫుట్‌బాల్ జట్టుకి 1977లో ఎంపికైన మారడోనా, 1986లో ఆర్జెంటీనా తరఫున ఆడి ప్రపంచ కప్ గెలవడంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఆ వరల్డ్ కప్ పోటీకి సంబంధించిన క్వార్టర్ ఫైనల్స్‌లో ఇంగ్లాండ్‌పై రెండు గోల్స్, సెమీఫైనల్స్‌లో బెల్జియంపై రెండు గోల్స్ చేసి ఆ దేశ ప్రజలకు ఆరాధ్యదైవంగా మారిపోయాడు మారడోనా.పుట్‌బాల్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే గోల్డెన్‌ బాల్‌ అవార్డును కూడా అందుకున్నాడు.
  • 2008 నుండి 2010 వరకు ఆర్జెంటీనా జాతీయ జట్టుకు ప్రధాన కోచ్‌గా వ్యవహరించారు మారడోనా. మారడోనా కోచ్‌గా ఉన్నప్పుడే 2010 ప్రపంచ కప్‌లో క్వార్టర్స్ వరకూ వెళ్లింది ఆర్జెంటీనా జట్టు. 
  • అయితే మారడోనా వ్యక్తిగత జీవితంపై పలు విమర్శలు కూడా వెల్లువెత్తాయి. డ్రగ్స్‌కు ఆయన అలవాటు పడ్డారనీ వార్తలు వచ్చాయి. అలాగే వైవాహిక జీవితం కూడా అతని విషయంలో ఎప్పుడూ సాఫీగా సాగలేదు. ఇటీవలే తనకంటే వయసులో బాగా చిన్నదైన రోకియో ఒలీవియా అనే మోడల్‌ను పెళ్ళి చేసుకోనున్నట్లు ప్రకటించాడు. అలాగే మాజీ భార్య క్లాడియా విల్లాఫనేకి సంబంధించిన విడాకుల విషయం ఇంకా కోర్టులోనే ఉంది
  • 2017లో ఫిఫాతో కలిసి పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు మారడోనా ఫేస్‌బుక్ ద్వారా ప్రకటించాడు. పుట్‌బాల్‌కు మారడోనా చేసిన సేవలను గుర్తించిన ఫిఫా అతడిని అంబాసిడర్‌గా నియమించుకుంది.
 
 

Trending News