England Need 138 Runs to Win T20 World Cup: టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ తడబడ్డారు. ఇంగ్లాండ్ రెచ్చిపోయి బౌలింగ్ చేశారు. క్రీజ్‌లోకి వచ్చిన బ్యాట్స్‌మెన్‌ను ఎక్కువ సేపు కుదురుకోననివ్వండా చేశారు. ఈ టోర్నీలో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్న శ్యామ్ కర్రన్.. ఫైనల్లో మ్యాచ్‌లో మరోసారి రెచ్చిపోయాడు. దీంతో పాకిస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 137 పరుగులకే పరిమితమైంది. కర్రన్ మూడు వికెట్లు తీయగా.. రషీద్, జోర్డాన్ చెరో రెండు వికెట్లు, బెన్ స్టోక్స్ ఒక వికెట్ తీశారు.
మొదట టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ ఆరంభం నుంచే నెమ్మదిగా ఆడింది. మొదటి ఓవర్లో బాబర్ ఆజమ్ ఒక ఫోర్ బాదడంతో 8 పరుగులు వచ్చాయి. మరో ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ ఇంగ్లండ్ బౌలర్లను ఎదుర్కొనేందుకు తీవ్ర ఇబ్బంది పడ్డాడు. నాలుగో ఓవర్‌లో సిక్స్ బాది కాస్తా టచ్‌లోకి వచ్చినట్లు కనిపించినా.. తర్వాతి ఓవర్‌లోనే రిజ్వాన్ (15)ను శ్యామ్ కర్రన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. వన్ డౌన్ బ్యాట్స్‌మెన్ మహ్మాద్ హరీస్ (8)ను ఆదిల్ రషీద్ పెవిటియన్‌కు పంపించాడు. మరో ఎండ్‌లో నిలకడగా ఆడుతున్న బాబర్ (32)ను కూడా రషీద్ ఔట్ చేశాడు. ఆ తరువాత వెంటనే ఇఫ్తీకార్ అహ్మాద్‌ను బెన్ స్టోక్స్ ఔట్ చేయడంతో 12.2 ఓవర్లలో 85 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
కానీ ఆ తరువాత షాన్ మసూద్, షాదాబ్ ఖాన్ పాక్ జట్టును ఆదుకున్నారు. ఇద్దరు వికెట్ల పతనాన్ని అడ్డుకోవడమే కాకుండా.. కాస్త వేగంగా పరుగులు చేశారు. పాక్ మళ్లీ పుంజుకుంటున్న సమయంలో మరోసారి శ్యామ్ కర్రన్ దెబ్బ తీశాడు. దూకుడుగా ఆడుతున్న షాన్ మసూద్ (28 బంతుల్లో 38)ను వెనక్కి పంపించాడు. తరువాతి ఓవర్లోనే క్రిస్ జోర్డాన్ బౌలింగ్‌లో షాదాబ్ ఖాన్ (20) వోక్స్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. మహ్మద్ నవాజ్ (5)ను కూడా శ్యామ్ కర్రన్ ఔట్ చేయడంతో పాక్ భారీ స్కోరు ఆశలకు గండిపడింది. చివరకు 8 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేసింది. 138 పరుగుల లక్ష్యంతో ఇంగ్లండ్ బరిలోకి దిగనుంది.