భారతీయులు హిందూ ముస్లిం గేమ్ ఆపాలి: హర్భజన్ సింగ్

భారతీయ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఈ రోజు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు

Last Updated : Jul 16, 2018, 01:09 PM IST
భారతీయులు హిందూ ముస్లిం గేమ్ ఆపాలి: హర్భజన్ సింగ్

భారతీయ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఈ రోజు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో హిందు, ముస్లిం మతాల మధ్య తలెత్తే వివాదాలకు అందరూ స్వస్తి పలకాలని భావిస్తున్నానని చెబుతూ హర్భజన్ పలు వ్యాఖ్యలు చేశారు. "50 లక్షల జనాభా కూడా లేని క్రొయేషియా.. ఈ రోజు ఫిఫా ఫైనల్ కప్ కోసం పోరాడుతోంది. కానీ 135 కోట్ల జనాభా ఉన్న భారత్ ఇంకా ఇక్కడ హిందూ ముస్లిం గేమ్ మాత్రమే ఆడుతోంది" అని హర్భజన్ ట్విట్టర్ వేదికగా తన ఆలోచనలను పంచుకున్నారు. ఈ వ్యాఖ్యలు చేశాక హర్భజన్ సింగ్ "సోచ్ బద్లో.. దేశ్ బద్లేగా" అని ట్యాగ్ చేస్తూ తన అభిమానులకు ట్వీట్ చేశారు.

"మీ ఆలోచనలు మార్చుకుంటే.. దేశం కూడా మారుతుంది" అనేది ఆ స్లోగన్ అర్థం. తాజాగా పెద్దగా అంచనాలు లేని పసికూన జట్టు క్రొయేషియా ఫిఫా ఫైనల్‌కు చేరిన సంగతి తెలిసిందే. నైజీరియా, అర్జెంటీనా, ఐస్లాండ్ లాంటి దిగ్గజ జట్ల మీదే విజయం సాధించి ఈ సారి క్రొయేషియా ఫైనల్ బెర్తు కైవసం చేసుకుంది. 

ఈ రోజు రాత్రి 8.30 నిముషాలకు ఫ్రాన్స్, క్రొయేషియా జట్ల మధ్య ఫుట్ బాల్ మ్యాచ్ జరుగుతున్న క్రమంలో హర్భజన్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, ఈ సారి ఫిఫా ఫైనల్‌‌లో కప్పు చేజిక్కించుకోవడం కోసం ఇరు జట్లు బాగానే సన్నద్ధమవుతున్నాయి. ముఖ్యంగా తమకంటే ఎన్నో రెట్లు బలమున్న ఫ్రాన్స్ జట్టుపై క్రొయేషియా ఆటగాళ్లు ఏ మాత్రం ప్రభావం చూపిస్తారో చూడాలని ఫుట్ బాల్ అభిమానులు కూడా వేచిచూస్తున్నారు.

ఇదిలా ఉండగా.. ఈ ఫైనల్ మ్యాచ్ పై ఎందరో బెట్టింగ్ బాబుల జీవితాలు కూడా ఆధారపడి ఉన్నాయి. భారత్‌లో ఈ బెట్టింగ్ రాయుళ్ల ఆట కట్టించడానికి ప్రత్యేక నిఘా వ్యవస్థను కూడా ఇప్పటికే పోలీస్ శాఖ వారు ఏర్పాటు చేయడం జరిగింది. 

Trending News