భారత జట్టు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి కష్టాలు తప్పేలా లేవు. ఇప్పటికే పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న అతడిపై భార్య హసీన్ జహాన్ కొత్త కేసు వేశారు. పశ్చిమ బెంగాల్ లోని అలిపోర్ కోర్టులో షమీ, అతని కుటుంబ సభ్యులపై గృహహింస కేసును దాఖలు చేశారు. ఈ కొత్త కేసులో షమీ తనకు భత్యం మరియు చికిత్స ఖర్చులు చెల్లించడం లేదని పేర్కొంది.
హసీన్ మహ్మద్ షమీ, అతని తల్లి, అన్నయ్య, వదినపై గృహ హింస కేసును దాఖలు చేసినట్లు హసీన్ జహాన్ తరపున్యాయవాది చెప్పారు. అంతేకాదు తన పోషణకయ్యే వ్యయాన్ని కూడా అతడి నుంచి ఇప్పించాలని కోరింది. హసీన్ జహాన్ నెలకు మొత్తం 10 లక్షలు డిమాండ్ చేస్తోంది. కుటుంబాల నిర్వహణ కోసం రూ.7 లక్షలు, బిడ్డ పోషణ కోసం రూ.3 లక్షలు డిమాండ్ చేస్తున్నారు. హసీన్ జహాన్ లాయర్ ప్రకారం, కేసు తీవ్రతను అర్థం చేసుకొని కోర్టు త్వరలోనే తీర్పు వెల్లడిస్తుందని అన్నారు. ఈ కేసుని గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
హసీన్ మార్చిలో మహ్మద్ షమీపై అత్యాచారం, హత్యా ప్రయత్నం, గృహ హింస, మ్యాచ్ ఫిక్సింగ్ వంటి అనేక తీవ్రమైన ఆరోపణలను చేశారు. అయితే, ఈ ఆరోపణలను షమీ ఖండించారు. అయినప్పటికీ, హసీన్ మహ్మద్ షమీపై నిందనలు ఆపడం లేదు. షమి తనను బెదిరించినట్లు కూడా తాజాగా హసీన్ ఆరోపించింది. మొహమ్మద్ షమి మొదట ఈ విషయాలపై మాట్లాడటానికి నిరాకరించాడు. అయితే ఇప్పుడు చట్టప్రకారం ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.
కొన్ని రోజుల క్రితం హసీన్ ఐపీఎల్ ఢిల్లీ జట్టు సీఈఓ హేమంత్ దువాను కలుసుకున్నారు. సమావేశం తరువాత హసీన్, 'హేమంత్ సారు ముందు నేను నా అభిప్రాయాన్ని చెప్పాను. మా కుటుంబ వివాదం ముగిసే వరకు, షమీని ఐపిఎల్ ఆడనివ్వొద్దని చెప్పాను" అని అన్నారు. ఢిల్లీడేర్ డెవిల్స్ మహ్మద్ షమీని రూ.3కోట్లకు వేలంలో కొన్న సంగతి తెలిసిందే..!
బీసీసీఐ యాంటీ-కరప్షన్ యూనిట్ మహ్మద్ షమీకి క్లీన్ చిట్ ఇచ్చింది మరియు బోర్డు అతనితో గ్రేడ్ బి ఒప్పందం కుదుర్చుకుంది. ఐపిఎల్ లో ఆడటానికి క్లీన్ చిట్ ఇచ్చారు. బీసీసీఐ నుండి క్లీన్ చిట్ పొందిన తరువాత, తన దేశం కోసం ఎల్లప్పుడూ ఆడాలని తాను కోరుకుతున్నట్లు మహ్మద్ షమీ చెప్పాడు. రెండు రోజుల క్రితం, మహ్మద్ షమీ పెళ్లై నాలుగేళ్లు పూర్యయింది. వివాహ వార్షికోత్సవం నాడు భార్య, కుమార్తెను గుర్తుచేసుకుంటూ ఇన్స్ స్టాగ్రామ్ లో పోస్ట్ కూడా పెట్టాడు.