Ind Vs Aus: ఫైనల్‌ ఫైట్‌లో ఆసీస్ హిట్.. భారత్ ఫ్లాప్ షో.. సిరీస్‌ కంగారూలదే..

Ind Vs Aus 3rd Odi Highlights: మూడో వన్డేలో భారత్ చిత్తయింది. ఆస్ట్రేలియా విధించిన 270 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 248 రన్స్‌కే కుప్పకూలింది. దీంతో 21 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మూడు వన్డేల సిరీస్‌ను ఆస్ట్రేలియా 2-1 తేడాతో గెలుపొందింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 22, 2023, 11:13 PM IST
Ind Vs Aus: ఫైనల్‌ ఫైట్‌లో ఆసీస్ హిట్.. భారత్ ఫ్లాప్ షో.. సిరీస్‌ కంగారూలదే..

Ind Vs Aus 3rd Odi Highlights: బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్ కోల్పోయిన ఆస్ట్రేలియా.. వన్డే సిరీస్‌లో మాత్రం చెలరేగింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్‌పై 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదటి వన్డేలో టీమిండియా గెలుపొందగా.. చివరి రెండు వన్డేల్లో కంగారూ జట్టు జయభేరి మోగించింది. మూడో వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 269 పరుగులకు ఆలౌట్‌ అవ్వగా.. భారత్ 49.1 ఓవర్లలో 248 రన్స్‌కే పరిమితమైంది. ఒక దశలో భారత్ విజయం దిశగా పయనించగా.. ఆసీస్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీశారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో ఆసీస్ సొంతమైంది.

ఆసీస్ విధించిన 270 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్‌కు మంచి ఆరంభం దక్కింది. కెప్టెన్ రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ మొదటి వికెట్‌కు 9.1 ఓవర్లలోనే 65 పరుగులు జోడించారు. ఈ క్రమంలో దూకుడు మీదున్న రోహిత్ (30)ను అబాట్ ఔట్ చేశాడు. ఆ తరువాత కాసేపటికే శుభ్‌మన్ గిల్‌ (37)ను పెవిలియన్‌కు పంపించాడు. 77 రన్స్‌కే రెండు వికెట్లు కోల్పోయిన దశలో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఆదుకున్నారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 93 బంతుల్లో 69 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టును మెరుగైన స్థితిలో నిలిపేందుకు ప్రయత్నించారు. 32 పరుగులతో క్రీజ్‌లో పాతుకుపోయిన కేఎల్ రాహుల్.. ఆడమ్ జంపా బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందు వచ్చిన అక్షర్ పటేల్ (2).. విరాట్ కోహ్లీతో సమన్వయం లోపంతో రనౌట్ అయ్యాడు.
 
అనంతరం వన్డేల్లో 65వ అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీ.. 54 పరుగులు చేసి అష్టన్ అగర్‌ బౌలింగ్‌లో వార్నర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాటపట్టాడు. తరువాత బంతికే సూర్యకుమార్ మరోసారి ఖాతా తెరవకుండా క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో 185 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లో పడింది. ఇక్కడి నుంచి హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా జట్టును విజయం దిశగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. కీలక సమయంలో హార్దిక్ (40) ఔట్ అవ్వడంతో భారత్ ఓటమి ఖాయమైంది. జడేజా (18) కూడా జంపా బౌలింగ్‌లో ఈజీ క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. చివర్లో షమీ వరుసగా సిక్స్, ఫోర్ బాది ఆశలు రేకెత్తించినా.. తరువాత బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. చివరి ఓవర్‌లో కుల్దీప్ యాదవ్ రనౌట్ అయ్యాడు. దీంతో భారత జట్టు  248 పరుగులకు కుప్పకూలింది. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడమ్ జంపా 4 వికెట్లు పడగొట్టగా.. అష్టన్ అగర్ 2 వికెట్లు తీశాడు. స్టోయినిస్, అబ్బాట్ తలో వికెట్ పడగొట్టారు.

అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ 49 ఓవర్లలో 269 పరుగులకు ఆలౌట్ అయింది. మిచెల్ మార్ష్ బ్యాట్ (47), అలెక్స్ కార్వీ (38) రాణించగా.. మిగిలిన బ్యాట్స్‌మెన్ తలో చేయి వేశారు. భారత బౌలింగ్‌లో హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ తలో వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్ చెరో వికెట్లు పడగొట్టారు. మ్యాన్‌ ఆఫ్ ద సిరీస్ అవార్డు మిచెల్ మార్ష్‌కు, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఆడం జంపాకు దక్కాయి.

Also Read: Ind Vs Aus 3rd Odi Updates: కుల్దీప్ యాదవ్ స్టన్నింగ్ బాల్.. షాక్‌లో ఆసీస్ బ్యాట్స్‌మెన్  

Also Read: Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ కథ ముగిసే.. మూడో వన్డేలోనూ గోల్డెన్ డక్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News