టీ20 ప్రపంచకప్‌లో భారత ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శన.. గణాంకాలు చూస్తే అభిమాని గుండె బద్దలవ్వాల్సిందే!

Indian players performance at T20 World Cup 2022. టీ20 ప్రపంచకప్‌లో భారత ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శనను ఓసారి చూద్దాం.  గణాంకాలు చూస్తే అభిమాని గుండె బద్దలవ్వాల్సిందే.   

Written by - P Sampath Kumar | Last Updated : Nov 11, 2022, 02:04 PM IST
  • టీ20 ప్రపంచకప్‌లో భారత ఆటగాళ్ల ప్రదర్శన
  • గణాంకాలు చూస్తే అభిమాని గుండె బద్దలవ్వాల్సిందే
  • కోహ్లీ, సూర్య, అర్షదీప్‌ మాత్రమే
టీ20 ప్రపంచకప్‌లో భారత ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శన.. గణాంకాలు చూస్తే అభిమాని గుండె బద్దలవ్వాల్సిందే!

India Players T20 World Cup 2022 individual performance: టీ20 ప్రపంచకప్‌ 2022లో సంచనాలు నమోదైన విషయం తెలిసిందే. క్వాలిఫైయర్ మ్యాచ్‌లలోనే మాజీ ఛాంపియన్ వెస్టిండీస్ ఇంటిదారి పట్టింది. పనికూనలు నెదర్లాండ్స్, ఐర్లాండ్ సూపర్ 12కి చేరాయి. ఇక కచ్చితంగా ఇంటికెళుతుందని భావించిన పాకిస్థాన్‌.. అనూహ్యంగా ఫైనల్స్‌కు చేరింది. ఇక కచ్చితంగా ఫైనల్స్‌ చేరుతుందని భావించిన భారత్ మాత్రం ఎవరూ ఊహించని విధంగా సెమీస్ నుంచి ఇంటిదారి పట్టింది. పేలవ బ్యాటింగ్, బౌలింగ్ కారణంగా గురువారం ఇంగ్లండ్‌తో జరిగిన రెండో సెమీ ఫైనల్లో భారత్ 10 వికెట్ల తేడాతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. 

పటిష్ట బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ ఉన్న భారత్ టీ20 ప్రపంచకప్‌ 2022లో చెత్తగా ఆడింది. సూపర్ 12లో పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లపై దాదాపుగా ఓడి గెలిచింది. దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయిన రోహిత్ సేన.. పసికూనలు నెదర్లాండ్స్, జింబాబ్వేలపై మాత్రమే సునాయాసంగా గెలిచింది.  ఎక్కువగా పసికూనలు ఉన్న గ్రూప్ బిలో ఉన్న భారత్‌ సెమీస్‌కు చేరడానికి చెమటోడ్చింది. టోర్నీ మొత్తంలో విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, అర్షదీప్‌ సింగ్ మాత్రమే రాణించారు. హార్దిక్ పాండ్యా పర్వాలేదనిపించాడు. టీ20 ప్రపంచకప్‌లో భారత ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శనను ఓసారి చూద్దాం. 

కేఎల్ రాహుల్‌: 
6 మ్యాచ్‌లు ఆడిన ఓపెనర్ కేఎల్ రాహుల్‌ 128 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్‌, జింబాబ్వేతో మ్యాచ్‌ల్లో హాఫ్ సెంచరీలు మినహాయిస్తే.. మిగతా మ్యాచులలో డబుల్ డిజిట్ కూడా అందుకోలేదు. రాహుల్ పేలవ ఫామ్ మిడిల్‌ ఆర్డర్‌పై తీవ్ర ప్రభావం చూపింది. 

రోహిత్‌ శర్మ: 
6 మ్యాచ్‌లు ఆడిన కెప్టెన్ రోహిత్ శర్మ 116 పరుగులు చేశాడు. ఓపెనర్‌గా విఫలమవడంతో మిగతా బ్యాటర్లపై ఒత్తిడి పడింది. బ్యాటర్‌గానే కాదు కెప్టెన్‌గానూ విఫలం అయ్యాడు. 

విరాట్‌ కోహ్లీ:
మెగా టోర్నీలో భారత్‌ తరఫున రాణించిన ఆటగాడు విరాట్ కోహ్లీ. నాలుగు అర్ధ శతకాలతో 296 పరుగులు బాదాడు. పొట్టి టోర్నీలో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

సూర్యకుమార్‌ యాదవ్‌: 
సూర్యకుమార్‌ యాదవ్‌ మూడు అర్ధ శతకాలతో 239 పరుగులు చేశాడు. జింబాబ్వేపై ఇన్నింగ్స్ చాలా స్పెషల్ అని చెప్పాలి. మెగా టోర్నీలో కోహ్లీ తర్వాత అత్యధిక రన్స్ చేసింది సూర్యనే.

హార్దిక్‌ పాండ్యా: 
హార్దిక్‌ పాండ్యా 6 మ్యాచ్‌లు ఆడి 128 పరుగులు చేశాడు. మరోవైపు కీలక సయమాల్లో 8 వికెట్లు తీశాడు. ఆల్‌రౌండర్‌గా జట్టు ఆపదలో ఉన్నప్పుడు తనవంతు కృషి చేశాడు. 

దినేష్‌ కార్తిక్‌:
దినేష్‌ కార్తిక్‌ మ్యాచ్‌ ఫినిషర్‌ అనిపించుకొనే ప్రదర్శన ఒక్కటి కూడా చేయలేదు. 4 మ్యాచ్‌ల్లో మూడు ఇన్నింగ్స్‌ ఆడి.. కేవలం 14 పరుగులు మాత్రమే చేశాడు. ఇక కీపర్‌గా కూడా విఫలమయ్యాడు. ఇక డీకే చాప్టర్ క్లోజ్ అయినట్టే.

దీపక్ హుడా:
దక్షిణాఫ్రికాపై ఆడిన దీపక్ హుడా డకౌట్ అయ్యాడు. అక్షర్ పటేల్ స్థానంలో ఆడిన దీపక్ మూడు బంతుల్లో ఒక పరుగు చేయలేదు. 

రిషబ్ పంత్‌: 
మెగా టోర్నీలో రిషబ్ పంత్‌ ఆడింది రెండు మ్యాచ్‌లే. అందులో కూడా కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చి నిరాశపరిచాడు. రెండు మ్యాచులలో 9 రన్స్ చేశాడు. 

రవిచంద్రన్‌ అశ్విన్‌: 
సీనియర్ స్పిన్నర్ ఆర్ అశ్విన్‌ ఏ మాత్రం ఆకట్టుకోలేదు. ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయడంలో విఫలం అయ్యాడు. ఆరు మ్యాచ్‌లు ఆడి 21 పరుగులు చేసి 6 వికెట్లు తీశాడు. 

అక్షర్‌ పటేల్‌: 
ఆల్‌రౌండర్‌గా అక్షర్‌ పటేల్‌ పూర్తిగా విఫలమయ్యాడు. పసలేని బ్యాటింగ్, బౌలింగ్‌తో నిరాశపరిచాడు. 5 మ్యాచ్‌లు ఆడి 9 పరుగులు చేసి.. 3 వికెట్లు మాత్రమే పడగొట్టాడు.

భువనేశ్వర్‌ కుమార్‌: 
సీనియర్ పేసర్ భువనేశ్వర్‌ కుమార్‌ పవర్‌ ప్లేలో పరుగులు మాత్రమే నియంత్రించాడు కానీ వికెట్లు పడగొట్టలేదు. ఆరు మ్యాచులో 4 వికెట్స్ మాత్రమే తీశాడు. ఇక ఇన్నింగ్స్ చివరలో భారీగా రన్స్ ఇచ్చాడు.  

మొహ్మద్ షమీ:
 మెగా టోర్నీలో మొహ్మద్ షమీ ప్రభావమే కనిపించలేదు. షమీ గురించి చెప్పుకోవడాని కూడా ఏమి లేదు. 6 మ్యాచ్‌ల్లో 6 వికెట్లు తీశాడు. 

అర్ష్‌దీప్‌ సింగ్‌: 
యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ టోర్నీ ఆసాంతం రాణించాడు. టీమిండియాను ఆదుకునే బౌలర్ ఎవరైనా ఉన్నారంటే అది ఇతడే. 6 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు సాధించాడు.

Also Read: T20 World Cup 2022: ఇంగ్లండ్‌పై భారత్ ఓడిపోవడమే మంచిదయ్యింది.. లేదంటేనా..!

Also Read: VVS Laxman Head Coach: రాహుల్ ద్రవిడ్ ఔట్.. టీమిండియా హెడ్‌ కోచ్‌గా వీవీఎస్‌ లక్ష్మణ్‌!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News