జొహన్నెస్‌బర్గ్ వేదికగా వాండరర్స్ స్టేడియంలో శనివారం జరిగిన 4వ వన్డే మ్యాచ్‌లో సౌతాఫ్రికా జట్టు టీమిండియాపై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. వర్షం ఆటంకం కారణంగా మ్యాచ్ 2 గంటలపాటు నిలిచిపోయింది. దీంతో మ్యాచ్‌ని డక్‌వర్త్- లూయిస్ పద్ధతిలో కొనసాగించేందుకు ఎంపైర్లు మ్యాచ్‌ని 28 ఓవర్లకు కుదించి సఫారీలకు 202 పరుగుల విజయ లక్ష్యాన్ని విధించారు.
వరుణ దేవుడు శాంతించిన తర్వాత మ్యాచ్ ప్రారంభించిన సఫారీలు 25.3 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి 207 పరుగులు పూర్తి చేయడంతో విజయం సౌతాఫ్రికాను వరించింది. అంతకన్నా ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ తర్వాత 6 వన్డేల సిరీస్‌లో టీమిండియా 3-1 తేడాతో ఆధిక్యంలో ఉంది. మంగళవారం జరగనున్న 5వ వన్డేకు పోర్ట్ ఎలిజబెత్ వేదిక కానుంది.