ఐపీఎల్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు కెప్టెన్ గౌతం గంభీర్ ఐపీఎల్లో 150 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఆటగాళ్ల జాబితాలో చేరిపోయాడు. జైపూర్ వేదికగా బుధవారం రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌తో గౌతీ ఈ ఘనత సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్లో 150 అంతకన్నా ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన 8వ ఆటగాడిగా గంభీర్ రికార్డ్ సొంతం చేసుకున్నాడు. నేడు 150వ మ్యాచ్ ఆడిన గౌతం గంభీర్ ఖాతాలో అంతకన్నా ముందే 4188 పరుగులు నమోదయ్యాయి. ఐపీఎల్ కెరీర్లో 36 అర్ధశతకాలు సాధించిన గౌతం గంబీర్.. అత్యధిక స్కోరు విషయంలోనూ 93 పరుగులతో టాప్ ప్లేయర్స్ జాబితాలో వున్నాడు. ఐపీఎల్ చరిత్రలో 150కి పైగా మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లలో ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ సురేశ్ రైనా అత్యధికంగా 163 మ్యాచ్‌లతో అగ్రస్థానంలో వున్నాడు. ఆ తర్వాత 161 మ్యాచ్‌లతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రెండో స్థానం సొంతం చేసుకున్నాడు.
ముంబై ఇండియన్స్ జట్టు కెప్టేన్ రోహిత్ శర్మ 160 మ్యాచ్‌లతో మూడో స్థానంలో, కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ దినేశ్ కార్తీక్ 154 మ్యాచ్‌లతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు. ఇక ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 11వ సీజన్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోల్‌కతా ఆటగాడు రాబిన్ ఉతప్ప, సన్‌రైజర్స్ ఆల్‌రౌండర్ యూసుఫ్ పఠాన్ 150 మ్యాచ్‌లు ఆడిన వారి జాబితాలో చేరారు. వీళ్లందరి తర్వాత తాజాగా గౌతం గంభీర్ 150 మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో 8వ స్థానం కైవసం చేసుకున్నాడు.