Ishant Sharma IPL: ఆఖరి ఓవర్‌లో ఇషాంత్ శర్మ అద్భుతం.. సిక్సర్ల తెవాటియాకు చెక్

GT Vs DC Highlights Ishant Sharma Final Over: గుజరాత్ టైటాన్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇషాంత్ శర్మ అద్భుతంగా బౌలింగ్ చేసి జట్టును గెలిపించాడు. ఆఖరి ఓవర్‌లో 12 రన్స్ అవసరం అవ్వగా.. కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు.   

Written by - Ashok Krindinti | Last Updated : May 3, 2023, 07:15 AM IST
Ishant Sharma IPL: ఆఖరి ఓవర్‌లో ఇషాంత్ శర్మ అద్భుతం.. సిక్సర్ల తెవాటియాకు చెక్

GT Vs DC Highlights Ishant Sharma Final Over: గుజరాత్‌తో ఢిల్లీ పోరు అనగానే.. చాలామంది క్రికెట్ అభిమానులు వార్ వన్ సైడే.. గుజరాత్‌దే విజయం అనుకున్నారు. అందరూ అంచనా వేసినట్లే మ్యాచ్‌ కూడా ఆరంభమైంది. అయితే అందరూ ఊహించినట్లు మాత్రం ఫలితం రాలేదు. ఆఖర్లో ఢిల్లీ అద్భుతం చేసింది. క్రీజ్‌లో హార్డ్ హిట్టర్ హార్ధిక్ పాండ్యా, సిక్సర్ల తెవాటియా ఉన్నా.. ఆఖరి ఓవర్‌లో 12 పరుగులు కాపాడుకుంది. దీనికి కారణం ఒకే ఒక్కడు ఇషాంత్ శర్మ. చివరి ఓవర్‌లో తన అనుభవాన్ని అంతా ఉపయోగించి అద్భుతంగా బౌలింగ్ చేసి జట్టును గెలిపించాడు. విజయం ఖాయం అనుకున్న గుజరాత్ ఆశలపై నీళ్లు చల్లాడు. 

ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇక నుంచి ప్రతి మ్యాచ్‌ కీలకమే. ఈ నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్ 5 పరుగుల తేడాతో ఓడించి ఆశలు సజీవంగా ఉంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. అనంతరం గుజరాత్ 131 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉండడంతో గుజరాత్‌కు ఈ స్వల్ప లక్ష్యం ఏం సరిపోతుందని అనిపించింది. అయితే ఢిల్లీ బౌలర్లు ఎక్కడా పట్టువీడలేదు. క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ.. పరుగులు ఇవ్వకుండా కట్టడి చేశారు. దీంతో మ్యాచ్‌ ఆఖరి వరకు వెళ్లింది.

చివరి రెండు ఓవర్లలో 33 పరుగులు అవసరమైన దశలో 19వ ఓవర్‌లో తెవాటియా హ్యాట్రిక్ సిక్సర్లు బాదడంతో నోకియా వేసిన ఆ ఓవర్‌లో మొత్తం 21 రన్స్ వచ్చాయి. దీంతో గుజరాత్ విజయానికి చివరి ఓవర్‌లో కేవలం 12 పరుగులే అవసరం అయ్యాయి. అప్పటికే క్రీజ్‌లో పాతుకుపోయిన హార్ధిక్ పాండ్యా, సిక్సర్లతో ఊపులో తెవాటియా ఉండడంతో ఢిల్లీకి మరో ఓటమి తప్పదేమో అనిపించింది. 

కానీ చివరి ఓవర్ బౌలింగ్ చేసేందుకు వచ్చిన ఇషాంత్ శర్మ తన అనుభవాన్ని అంతా ఉపయోగించాడు. మొదటి బాల్‌కు పాండ్యా రెండు పరుగులు తీయగా.. రెండో బంతికి సింగిల్ తీసి తెవాటియాకు స్ట్రైకింగ్ ఇచ్చాడు. అప్పటికే హ్యాట్రిక్ సిక్సర్ల బాది ఊపుమీదున్న తెవాటియా.. ఈజీగా జట్టును గెలిపిస్తాడని అందరూ అనుకున్నారు. ఇక్కడే ఇషాంత్ తన మార్క్ చూపించాడు. మూడో బాల్‌ను తెలివిగా ఆన్‌ది లైన్‌ వేయడంతో తెవాటియా షాట్ ఆడలేకపోయాడు. వైడ్ కోసం రివ్యూకు వెళ్లినా ఫలితం లేకపోయింది. నాలుగో బంతిని ఎక్స్‌ట్రా కవర్స్‌ మీదుగా భారీ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించాడు. ఇషాంత్ బౌన్స్ వేయడంతో బంతి బ్యాట్‌ ఎడ్జ్‌ తాకి గాల్లోకి లేచింది. రిలీ రొసౌ క్యాచ్ పట్టేడంతో ఢిల్లీ శిబిరంలో ఆనందం వెల్లివెరిసింది. చివరి రెండు బంతులకు రషీద్ ఖాన్ నాలుగు పరుగులు చేయడంతో ఢిల్లీ 5 రన్స్ తేడాతో విజయం సాధించింది. 

ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన ఇషాంత్ శర్మ.. కేవలం 23 పరుగులు ఇచ్చి రెండు కీలక వికెట్లు తీసి కీలక పాత్ర పోషించాడు. సీజన్ ఆరంభానికి ముందు ఈ సీనియర్ బౌలర్‌పై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. ఢిల్లీ క్యాపిటల్స్ వరుస ఓటముల నేపథ్యంలో తుది జట్టులో చోటు కల్పించింది. దీంతో తనకు వచ్చిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్నాడు. ఐపీఎల్‌లో చాలా కాలం తర్వాత ఇషాంత్ శర్మకు ఈ సీజన్‌లో ఆడే అవకాశం లభించింది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ విజయం సాధించడంతో ఇషాంత్‌ శర్మ కీలకపాత్ర పోషించాడు. ఆ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. ఆ మ్యాచ్‌లో 3 ఓవర్లలో కేవలం 18 పరుగులిచ్చి  ఒక వికెట్ తీశాడు. తాజాగా గుజరాత్‌పై కూడా ఇషాంత్ శర్మ పర్ఫామెన్స్‌ మ్యాన్‌ ఆఫ్ ద మ్యాచ్‌కు కంటే తక్కువేమి కాదు. ఇషాంత్‌పై నెట్టింట ప్రశంసల వర్షం కురుస్తోంది.

Also Read: Indore Crane Accident: ఘోర విషాదం.. క్రేన్ కింద పడి నలుగురు దుర్మరణం  

Also Read: GT Vs DC Highlights: వాట్ ఏ గేమ్‌.. థ్రిల్లింగ్ మ్యాచ్‌లో ఢిల్లీ విక్టరీ.. గుజరాత్‌కు వార్నర్ సేన చెక్  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

 ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News