ఢాకా: శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌కు సిద్ధమవుతున్న బంగ్లాదేశ్ జట్టుకు దెబ్బ మీద దెబ్బ తగిలింది. కెప్టెన్ మష్రఫె మోర్తాజా గాయం కారణంగా జట్టు నుంచి తప్పుకోవాల్సి రావడంతో తమీమ్ ఇక్బాల్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. తమీమ్ ఇక్బాల్‌కి వన్డే ఇంటర్నేషనల్స్‌లో జట్టుకు నేతృత్వం వహించడం ఇదే తొలిసారి. 2017లో ఓసారి న్యూజిలాండ్ పర్యటనలో ఉండగా ఆ సిరీస్ కెప్టేన్ ముష్ఫికర్ రహీం గాయం కారణంగా ఆటకు దూరం కావడంతో తమీమ్ ఇక్బాల్ జట్టుకు సారథ్యం వహించాడు.
ఇదిలావుంటే, మష్రఫె మోర్తాజా జట్టుకు దూరం కావడానికంటే ముందే ఆల్ రౌండర్ మొహమ్మద్ సైఫుద్దీన్ కూడా గాయం కారణంగా శ్రీలంక పర్యటనకు దూరమైన సంగతి తెలిసిందే. పేసర్ తస్కిన్ అహ్మద్, ఆల్ రౌండర్ ఫర్హాద్ రెజాలు ఈ ఇద్దరి స్థానాల్లో జట్టులోకి ఎంపిక అయ్యారు. ప్రపంచ కప్‌లో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన షకీబల్ హసన్, లిటన్ దాస్‌లు కూడా వ్యక్తిగత కారణాల రీత్యా శ్రీలంక పర్యటనకు అందుబాటులో లేకపోవడం జట్టుకు ఓ మైనస్ పాయింట్‌గానే భావించొచ్చని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.
శ్రీలంక పర్యటనపై బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ మొసాద్దిక్ హొస్సైన్ మాట్లాడుతూ.. లంక జట్టు కంటే తాము అన్ని విభాగాల్లోనూ పటిష్టంగానే ఉన్నామని ధీమా వ్యక్తంచేశాడు. ఈ నెల 26న కొలంబోలో ఇరు జట్ల మధ్య తొలి వన్డే జరగనుంది. కొలంబోలోనే ఈ నెల 28న రెండో వన్డే, 31న మూడో వన్డే మ్యాచ్ జరగనున్నాయి. మూడు వన్డేల కోసం ఇప్పటికే బంగ్లా ఆటగాళ్లు భారీ భద్రత మధ్య కొలంబోకు చేరుకున్నారు.