ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వార్న్ మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. విరాట్ కోహ్లీ, డీవిలియర్స్ తన అభిప్రాయంలో గొప్ప బ్యాట్స్‌మన్ అని ఆయన కితాబిచ్చారు. అలాగే సచిన్ టెండుల్కర్ సైతం సాధించలేని ఎన్నో విజయాలను విరాట్ కోహ్లీ సాధించాడని షేన్ వార్న్ అభిప్రాయపడ్డారు. సెంచరీలు కొట్టడంలో సచిన్‌తో పోటీ పడడం కోహ్లీకి మాత్రమే సాధ్యమని ఆయన అన్నారు.
తాను క్రికెట్ ఆడుతున్న రోజుల్లో సచిన్, లారా తనకు గొప్ప బ్యాట్స్‌మన్లుగా కనిపించేవారని.. కానీ వారి స్థానాలను ఈ రోజుల్లో విరాట్ కోహ్లీ, డివిలియర్స్ భర్తీ చేస్తున్నారని వార్న్ తెలిపారు. అయితే వీరిద్దరిలో మాత్రం ఎవరు బెస్ట్ అన్నది చెప్పడం కష్టమని.. ఇద్దరూ బాగానే రాణిస్తున్నారని వార్న్ అన్నారు. ప్రస్తుతం వార్న్ రాజస్థాన్ రాయల్స్ జట్టుకి సలహాదారుగా వ్యవహరిస్తున్నారు.
త్వరలోనే ఇంగ్లాండ్‌తో జరగబోయే మ్యా్చ్‌ల్లో కోహ్లీ రికార్డులు నమోదు చేసే అవకాశం ఉందని.. ఆ దిశగా ఆయన ప్రయత్నిస్తున్నాడని వార్న్ జోస్యం చెప్పారు. ఇప్పటి వరకు తను ఇంగ్లాండ్ పై అంత బాగా రాణించలేదని..కాని రానున్న రోజుల్లో మాత్రం తన సత్తా చూపించుకొనే అవకాశం అయితే కోహ్లీకి కచ్చితంగా దక్కుతుందని వార్న్ అన్నారు. గతంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌ల్లో కూడా కోహ్లీ తనదైన శైలిలో రాణించాడన్నారు.