అండర్-19 ప్రపంచ కప్‌లో విజయం సాధించి, భారత్‌కి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చిన యంగ్ టీమిండియా జట్టుకు కోచింగ్ ఇచ్చిన రాహుల్ ద్రావిడ్‌కి బీసీసీఐ రూ.50 లక్షల నజరానా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే బీసీసీఐ తనకు మాత్రమే రూ.50 లక్షలు ప్రకటించి, ఆటగాళ్లకు రూ.30 లక్షలు, సహాయక సిబ్బందికి రూ.20 లక్షలు మాత్రమే ప్రకటించడంపై రాహుల్ ద్రావిడ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసినట్టు తెలుస్తోంది. టైమ్స్ నౌ న్యూస్ ప్రచురించిన ఓ కథనం ప్రకారం.. నజరానాలు ప్రకటించడంలో బీసీసీఐ వివిక్ష చూపిందని రాహుల్ అసహనం వ్యక్తంచేసినట్టు సమాచారం.
జట్టు విజయం కోసం అందరం కష్టపడ్డాం. అందరం సమానంగా కృషి చేశాం. కానీ బీసీసీఐ మాత్రం తనకి మాత్రమే అధికంగా రూ.50 లక్షలు ఇచ్చి ఆటగాళ్లకు, సహాయక సిబ్బందికి తక్కువ నజరానా ప్రకటించింది అని రాహుల్ బీసీసీఐ వైఖరిని ప్రశ్నించాడనేది ఆ కథనం సారాంశం. అందరికీ సమానమైన స్థాయిలో ప్రోత్సాహకాలు అంది వుంటే బాగుండేది అని రాహుల్ ద్రావిడ్ అభిప్రాయపడినట్టు ఆ వార్తా కథనం పేర్కొంది. నజరానాలు ప్రకటించిన తీరులో బీసీసీఐ తప్పు చేసిందని రాహుల్ ద్రావిడ్ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలపై బోర్డ్ ఏమని స్పందిస్తుందో వేచిచూడాల్సిందే మరి!!