ఐపీఎల్ ప్రారంభోత్సవంలో సందడి చేయనున్న స్టార్స్ వీరే..!

ఐపీఎల్ పదకొండో సీజన్‌ ఏప్రిల్ 7వ తేదీ నుంచి ప్రారంభమవుతోంది.

Last Updated : Apr 1, 2018, 04:33 PM IST
ఐపీఎల్ ప్రారంభోత్సవంలో సందడి చేయనున్న స్టార్స్ వీరే..!

ఐపీఎల్ పదకొండో సీజన్‌ ఏప్రిల్ 7వ తేదీ నుంచి ప్రారంభమవుతోంది. అదే రోజున ప్రారంభోత్సవం కూడా అట్టహాసంగా జరగనుంది. మామూలుగా అయితే ఈ ధనాధన్ టీ20 టోర్నీ మ్యాచ్‌లు ప్రారంభం కావడానికి ఒక్కరోజు ముందు వినోద కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయతీ. కానీ, ఈసారి తొలి మ్యాచ్‌ ప్రారంభం రోజే ఈ వేడుక జరగనుంది. గత సీజన్ల మాదిరిగానే ఈ సీజన్‌ని కూడా బాలీవుడ్ తారల ఆటపాటలతో క్రికెట్ అభిమానులకు ఉర్రూతలూగించేలా చేయాలని ఐపీఎల్ యాజమాన్యం భావిస్తోంది.

ఇందులో భాగంగా.. బాలీవుడ్ స్టార్లు రణ్‌వీర్ సింగ్, వరుణ్ ధావన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, పరిణితి చోప్రాలతో పాటు పలువురు వేదికపై డాన్సు చేయనున్నారని సీనియర్ బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఈ షో సుమారు 45 నిమిషాలపాటు ఉంటుందని చెప్పారు. అలాగే ప్రముఖ గాయకుడు మికా సింగ్, ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా కూడా తమ ప్రదర్శనలతో ఆకట్టుకోనున్నారు.

కాగా, ఈ కార్యక్రమంలో ప్రదర్శన ఇచ్చేందుకు రణ్‌వీర్ సింగ్ రూ.5 కోట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం. వరుణ్ ధావన్ అత్యధికంగా రూ.6 కోట్లు అడిగినట్లు సమాచారం. అయితే ఆ వార్తల్లో నిజం లేదని ఆ అధికారి తెలిపారు.  వేడుక అనంతరం డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియంలో మొదటి మ్యాచ్ జరుగుతుంది. మే 27న జరిగే ఫైనల్ మ్యాచ్‌కి ఇదే స్టేడియం వేదిక కానుంది.

లోధా కమిటీ సిఫార్సుల మేరకు రెండేళ్ల బహిష్కరణలకు(ఐపీఎల్ 2016,ఐపీఎల్ 2017) గురైన రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ఈ ఏడాది జరిగే ఐపీఎల్‌లో ఆడనున్నారు. 2017 ఐపీఎల్ ప్రారంభోత్సవంలో బాలీవుడ్ స్టార్లు  కత్రినా కైఫ్, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, క్రితి సనోన్, అమీ జాక్సన్ తదితరులు సందడి చేశారు.

Trending News