మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల ప్రాంతంలో టిబెటిన్ బౌద్ధగురువు దలైలామాతో భేటీ అయ్యారు. పలు వ్యక్తిగత పనుల నిమిత్తం నాలుగు రోజుల ధర్మశాల పర్యటనలో ఉన్న సచిన్, ఈ రోజు అదే ప్రాంతంలో ఓ దత్త నివాసంలో ఉంటున్న దలైలామాని కలిశారు. ఆ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన సచిన్ ఆ భేటీ గురించి చెబుతూ, తామిరువురం ప్రపంచశాంతి గురించి, మనుషుల మధ్య పెరగాల్సిన సయోధ్య ఇత్యాది అంశాల గురించి చర్చించినట్లు తెలిపారు.
దలైలామాతో భావాలు పంచుకోవడం అనేది ఓ గొప్ప అనుభవం అని పేర్కొన్నారు. హిమాచల్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంకు చాలా దగ్గరలోనే దలైలామా నివాసం ఉండడం విశేషం. దలైలామాని కలవక ముందు సచిన్ స్టేడియంలోని యువ క్రికెటర్లతో మాట్లాడారు. వారికి బ్యాటింగ్ టెక్నిక్స్ నేర్పించారు. ఆ తర్వాత అక్కడ నిర్మించిన క్రికెట్ మ్యూజియం ప్రారంభోత్సవంలో కూడా సచిన్ పాల్గొన్నారు.