నేడే హైదరాబాద్‌లో చంద్రబాబు రెండో రోజు రోడ్ షో

   

Last Updated : Nov 29, 2018, 11:45 AM IST
నేడే హైదరాబాద్‌లో చంద్రబాబు రెండో రోజు  రోడ్ షో

తెలంగాణలో రెండో రోజు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి ప్రచార కార్యక్రమాలకు రంగం సిద్ధమైంది. శేర్‌లింగంపల్లి నియోజకవర్గంలో ఈ రోజు చంద్రబాబు తన రోడ్ షో నిర్వహించనున్నారు. కావూరి హిల్స్‌, బొటానికల్‌  గార్డెన్‌, కొత్తగూడ క్రాస్‌ రోడ్, లింగంపల్లి మొదలైన చోట్ల జరిగే రోడ్ షోలకు చంద్రబాబు హాజరుకానున్నారు. అలాగే చందానగర్‌, గంగారం, ఆల్విన్‌ కాలనీ జంక్షన్‌లో జరిగే కార్యక్రమాలలో పాల్గొని పలు సభల్లో ప్రసంగిస్తారు.  మియాపూర్‌,  హైదర్‌నగర్‌ మీదుగా నిజాంపేట క్రాస్‌రోడ్‌లో నిర్వహించే రోడ్ షోకు కూడా చంద్రబాబు హాజరుకానున్నారు.

నిన్న హైదరాబాద్‌లో జరిగిన పలు కార్యక్రమాల్లో కూడా చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. : తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌  వల్ల హైదరాబాద్‌కి ఏం ఒరిగిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. కేసీఆర్ మెట్రో రైలు ప్రాజెక్టుకు అడ్డంపడటం తప్ప చేసిందేమీ లేదని, అందువల్లే హైదరాబాద్‌కు మెట్రోరైలు ప్రాజెక్టు ఆలస్యమైందని చంద్రబాబు ఆరోపించారు. 

తానెప్పుడూ టీఆర్‌ఎస్‌ గురించి చెడుగా మాట్లాడలేదని.. అయినాసరే తన పేరెత్తితే చాలు కేసీఆర్ ఆవేశంతో ఊగిపోతారని చెబుతూ.. తాను ఏం తప్పు చేశానో చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో  బుధవారం జరుగుతున్న ప్రజా కూటమి సభలో పాల్గొని మాట్లాడిన సందర్భంగా చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ కావాలని, తెలంగాణ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలన్నదే  తన ఏకైక కోరిక అని చంద్రబాబు పేర్కొన్నారు. 

Trending News