హైదరాబాద్: షాద్ నగర్ వద్ద పశు వైద్యాధికారిణిపై పశు వాంఛ తీర్చుకుని, ఆ తర్వాత ఆమెను దారుణంగా హతమార్చిన కేసులో అరెస్ట్ అయిన నలుగురు నిందితులు ప్రస్తుతం చర్లపల్లి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. నలుగురు నిందితులకు మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించడంతో వారిని కట్టుదిట్టమైన భద్రత మధ్య శనివారమే చర్లపల్లి జైలుకు తరలించారు. చర్లపల్లి జైలులోనూ తోటి ఖైదీల నుంచి వీరికి సంబంధం లేకుండా హై సెక్యూరిటీ బ్లాక్‌లో ఉంచారు. ప్రధాన నిందితుడైన ఏ1 మహ్మద్ ఆరిఫ్‌కు-1979, ఏ2 జోళ్లు శివకు-1980, ఏ3 చింతకుంట చెన్నకేశవులు-1981, ఏ4 జోళ్లు నవీన్‌కు-1982 నెంబర్లను కేటాయించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ సామూహిక అత్యాచారం, హత్య కేసులో నిందితులపై పౌరసమాజం ఆగ్రహావేశాలు వెళ్లగక్కుతోంది. నిందితులను కఠినంగా శిక్షించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. నిందితులు చర్లపల్లి జైలులో ఉన్నారనే సమాచారంతో వారిపై తమ నిరసన వ్యక్తంచేసేందుకు భారీ సంఖ్యలో జనం అక్కడికి తరలివస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థి సంఘాలు, మహిళలు, ప్రజా సంఘాలు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేపడుతున్నాయి. దీంతో చర్లపల్లి జైలు బయట భారీ సంఖ్యలో పోలీసులను మోహరించి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
Read also : వాళ్లను చంపేద్దాం సార్.. ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి!!
చర్లపల్లి జైలు బయట ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టిన పోలీసులు.. జైలు వైపుగా వస్తున్న వారిని ప్రశ్నించి జైలుకు కొద్ది దూరంలోంచే వెనక్కి పంపించేస్తున్నారు. నిందితులపై దాడి జరిగే ప్రమాదం ఉందని భావిస్తున్న ఉన్నతాధికారులు.. జైలు బయట భారీ భద్రత ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశాలు జారీచేసినట్టు తెలుస్తోంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు జైలు బయట నిరంతరం గస్తీ కాస్తూ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు.
నిందితులను షాద్ నగర్ పోలీసు స్టేషన్ నుంచి కోర్టుకు తరలించే క్రమంలో అక్కడ స్థానికుల నుంచి వారిపై ఎంత వ్యతిరేకత వ్యక్తమైందో తెలిసిందే. ఓవైపు ప్రధాన రహదారిపై పోలీసులు గట్టి భద్రత మధ్య నిందితులను తరలించినప్పటికీ.. రోడ్డుకు ఇరువైపులా చుట్టూ చేరిన స్థానికులు.. వారిపై దాడి చేసినంత పనిచేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు చర్లపల్లి జైలు బయట సైతం భారీ భద్రత ఏర్పాటు చేశారు. Read also : హైదరాబాద్ 'నిర్భయ' కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్