దిశ హత్య కేసులో నిందితులను పోలీసు కస్టడీకి ఇవ్వాల్సిందిగా పిటిషన్ దాఖలు

దిశపై అత్యాచారం, దారుణ హత్య ఘటనపై ఆందోళన వ్యక్తంచేస్తూ దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈ ఘటన విషయంలో తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడిన తీరుతో పాటు పోలీసుల తీరుపైనా విమర్శలు వెల్లువెత్తాయి.

Updated: Dec 2, 2019, 09:30 PM IST
దిశ హత్య కేసులో నిందితులను పోలీసు కస్టడీకి ఇవ్వాల్సిందిగా పిటిషన్ దాఖలు

హైదరాబాద్: దిశపై అత్యాచారం, దారుణ హత్య ఘటనపై ఆందోళన వ్యక్తంచేస్తూ దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈ ఘటన విషయంలో తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడిన తీరుతో పాటు పోలీసుల తీరుపైనా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో తెలంగాణ పోలీసులు కేసులో దర్యాప్తు ముమ్మరం చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే కోర్టు ఆదేశాల మేరకు నిందితులను చర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించిన సైబరబాద్ పోలీసులు... విచారణ నిమిత్తం వారిని మరోసారి పోలీసు కస్టడీకి తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో నలుగురు నిందితులను 10 రోజులు పాటు పోలీస్ కస్టడీకి అప్పగించాలని కోరుతూ.. షాద్‌నగర్ పోలీసులు అక్కడి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను కోర్టు ముందు సమర్పిస్తామని షాద్ నగర్ పోలీసులు తెలిపారు.   

ఇదిలావుంటే, మరోవైపు త్వరితగతిన కేసు విచారణ పూర్తిచేసి నిందితులకు శిక్ష పడేలా చూడాల్సిందిగా రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి దర్యాప్తు బృందాన్ని ఆదేశించారు. ఈ విషయమై న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పీటీఐతో మాట్లాడుతూ.. వీలైనంత త్వరగా కేసు విచారణ పూర్తి చేసి నిందితులకు శిక్ష పడేలా ఓ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.