Heavy Rains in Hyderabad: భానుడి ప్రతాపంతో అల్లాడిపోతున్న హైదరాబాద్ ప్రజలకు ఎట్టకేలకు ఉపశమనం లభించింది. శుక్రవారం తెల్లవారుజామున ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. గత కొన్ని రోజులుగా విపరీతమైన ఉష్ణోగ్రతలు నమోదవ్వగా.. నేడు కాస్త వాతావరణం చల్లబడింది. గురువారం సాయంత్రం నుంచి నగరంలోని ఉప్పల్‌లో వర్షం కురువగా.. ఇవాళ తెల్లవారుజామున ఐదు గంటల నుంచి మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట, నల్లకుంట, కాచిగూడ, కూకట్‌పల్లితోపాటు నగరవ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. పలు చోట్ల వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ పోలీసులు వర్షం సైతం లెక్కచేయకుండా విధుల్లో నిమగ్నమై.. ట్రాఫిక్ క్లియర్ చేసి పంపిస్తున్నారు.
గత కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. దాదాపు 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. వడగాల్పులు వీస్తుండడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మధ్యాహ్నం సమయంలో అయితే ద్విచక్ర వాహనదారులు ప్రయాణం చేసేందుకు భయపడుతున్నారు. ఇంత వేడి సమయంలో ఒక్కసారిగా వర్షాలు కురవడంతో నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో రాగల మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. కొన్ని జిల్లాల్లో మెరుపులు, ఉరుములతో కూడిన వర్షం పడుతుందని చెప్పారు. ఈ నెల 16వ తేదీ వరకు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. గురువారం నిజామాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్ తదితర జిల్లాల్లో వర్షాల్లోని పలు ప్రాంతాల్లో కురిశాయి.
Also Read: IPL 2023 Updates: చెన్నైపై గెలిచిన రాజస్థాన్‌కు షాక్.. సంజూ శాంసన్‌కు ఫైన్
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు దంచికొడుతున్నాయి. శుక్రవారం 7 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 168 మండలాల్లో వడగాల్పులు, శనివారం 106 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఎండ నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా 7, అనకాపల్లి 13, తూర్పుగోదావరి 14, ఏలూరు 11, గుంటూరు 11, కాకినాడ 14, కోనసీమ 6, కృష్ణా 11, నంద్యాల 4, ఎన్టీఆర్ 16, పల్నాడు 8, పార్వతీపురంమన్యం 12, శ్రీకాకుళం 13, విశాఖపట్నం 4, విజయనగరం 22, వైఎస్సార్ 2 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.