ప్లాట్లు వేలం వేసేందుకు హెచ్ఎండీఏ ప్రణాళికలు

ప్లాట్లను అమ్మకానికి పెట్టడం ద్వారా సుమారు రూ.700 కోట్ల నిధులని సమీకరించేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ప్రణాళికలు రచిస్తోంది.

Last Updated : Mar 21, 2018, 12:29 PM IST
ప్లాట్లు వేలం వేసేందుకు హెచ్ఎండీఏ ప్రణాళికలు

తమ అధికారిక ప్రాంత పరిధిలో వున్న ప్లాట్లను అమ్మకానికి పెట్టడం ద్వారా సుమారు రూ.700 కోట్ల నిధులని సమీకరించేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగానే ఇప్పటికే హెచ్ఎండీఏ పరిధిలో మొత్తం 229 ప్లాట్లను గుర్తించినట్టు ఆ సంస్థ స్పష్టంచేసింది. ఈ 229 ప్లాట్ల అమ్మకం ద్వారా వచ్చిన నిధులకు మరిన్ని నిధులు జోడించి హైదరాబాద్ నగరంలో రూ.1,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు హెచ్ఎండీఏ సమాయత్తమవుతున్నట్టు హెచ్ఎండీఏ కమిషనర్ టీ చిరంజీవులు సోమవారం ప్రకటించారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత హెచ్ఎండీఏ మరోసారి ప్లాట్లు వేలం వేయడానికి నిర్ణయం తీసుకుంది. 

ఈ-టెండర్-కమ్-ఈ-ఆక్షనింగ్ విధానం ద్వారా హెచ్ఎండీఏ పరిధిలో వివిధ ప్రాంతాల్లో వివిధ పరిణామాల్లో వున్న 229 ప్లాట్లను ( మొత్తం విస్తీర్ణం 1.24 లక్షల చదరపు గజాలు) ఆ సంస్థ విక్రయించనుంది. బాచుపల్లి లాంటి ప్రాంతాల్లో రూ.16,000లకు చదరపు గజం నుంచి ప్రారంభం కానున్న ధర నందగిరి హిల్స్ లాంటి ప్రాంతాల్లో రూ.80,000 వరకు పలకనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ 229 ప్లాట్ల వేలం ద్వారా కేవలం రూ.300 కోట్లు వస్తాయని అంచనా వేస్తోన్న హెచ్ఎండీఏ.. రానున్న ఆరు నెలల్లో మరో రెండు దశల్లో ఇదే తరహాలో వేలం నిర్వహించడం ద్వారా మొత్తం రూ.700 కోట్ల నిధులు సమీకరించొచ్చని భావిస్తోంది. 

ఈ వేలంలో పాల్గొనాలనుకునే వారు ఏప్రిల్ 9వ తేదీలోగా mstcecommerce.com వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయి రూ.100 కనీస రుసుం చెల్లించి తమ పేరు నమోదు చేసుకోవాల్సి వుంటుంది. ఏప్రిల్ 10వ తేదీ నుంచి 12వ తేదీ మధ్య ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, అలాగే మళ్లీ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ వేలం నిర్వహించనున్నారు.   

Trending News