Gaddar Death News: ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గద్దర్.. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుది శ్వాస విడిచారు. గద్దర్ మరణించిన వార్తను కొడుకు సూర్యం ధృవీకరించారు. 1949లో తూఫ్రాన్‌లో జన్మించిన గద్దర్ అసలు పేరు విఠల్ రావు. తన పాటలతో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడేలా చేశారు గద్దర్. గద్దర్ మరణంతో తెలంగాణ ప్రజానీకం తీవ్రవిషాదంలో మునిగిపోయింది. రెండు రోజుల క్రితం ఆపరేషన్ సక్సెస్ అయినట్లు అపోలో ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించిన విషయం తెలిసిందే.
గద్దర్ మృతిపై హైదరాబాద్ అమీర్ పేట్లోని అపోలో స్పెక్టా ఆస్పత్రి వైద్యులు ప్రకటన చేశారు. ఊపిరితిత్తులు, మూత్ర సమస్యలు, వయసు సంబంధిత కారణాలతో ఈ మధ్యాహ్నం 3 గంటలకు కన్నుమూశారని తెలిపారు. గద్దర్ తీవ్రమైన గుండె వ్యాధితో జులై 20న ఆస్పత్రిలో చేరారని.. ఆగస్టు 3న బైపాస్ సర్జరీ చేశామని పేర్కొన్నారు. దాని నంచి కోలుకున్నప్పటికీ గతంలోని ఊపిరితిత్తుల సమస్య రావడంతో మరణించారని తెలిపారు.
గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్ రావ్. నిజామాబాద్, హైదరాబాద్‌లో ఆయన విద్యాభ్యాసం పూర్తి చేశారు. 1975లో కెనరా బ్యాంకులో ఉద్యోగం చేరిన గద్దర్‌కు భార్య విమల, ముగ్గురు పిల్లలు ఉన్నారు. జన నాట్యమండలి వ్యవస్థాపకుల్లో ఒకరైన గద్దర్.. ప్రజా సమస్యలపై తన గళంతో పోరాటం చేశారు. తనదైన పాటలతో ప్రజలను ఉత్తేజపరిచేవారు. తెలంగాణ ఉద్యమానికి గద్దర్ పాటలు ఊపిరి పోశాయి.
ఇక 1987లో కారంచేడు దళితుల హత్యలపై గద్దర్ పోరాటం ఎన్నటికీ మరువనిది. నకిలీ ఎన్‌కౌంటర్లను తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. అవిశ్రాంతంగా పోరాటం చేశారు. "అమ్మ తెలంగాణమా", "పొడుస్తున్న పొద్దుమీద" వంటి పాటలు తెలంగాణ ఉద్యమంలో ప్రజల పోరాటానికి తోడుగా నిలిచాయ. "పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమా.." అనే పాటకు నంది అవార్డు వచ్చినా.. గద్దర్ తిరస్కరించారు. పీపుల్స్ వార్, మావోయిస్టు, తెలంగాణ ఉద్యమాల్లో తన గళంతో కోట్లాది మంది ప్రజలను ఉత్తేజపరిచిన యుద్ధనౌక గద్దర్.. 74 ఏళ్ల వయసులో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి