Dikshit Kidnap Case: బాలుడ్ని హత్య చేశాక డబ్బు డిమాండ్ చేసిన కిడ్నాపర్లు

Mahabubabad Minor Boy Kidnap Case | ఆర్థిక లావాదేవీలు, వ్యక్తిగత గొడవల నేపథ్యంలో కిడ్నాపైన బాలుడు దీక్షిత్ రెడ్డిని కేవలం రెండు గంటల వ్యవధిలోనే నిందితులు హత్య చేశారు. ఆ తర్వాతే బాలుడి తల్లిదండ్రులకు కాల్ చేసి డబ్బులు డిమాండ్ చేయడం గమనార్హం.

Last Updated : Oct 22, 2020, 01:02 PM IST
Dikshit Kidnap Case: బాలుడ్ని హత్య చేశాక డబ్బు డిమాండ్ చేసిన కిడ్నాపర్లు

ఆర్థిక లావాదేవీలు, వ్యక్తిగత గొడవల నేపథ్యంలో కిడ్నాపైన బాలుడు దీక్షిత్ రెడ్డిని హత్య చేశారు. ఆదివారం కిడ్నాప్ అయిన బాలుడి కేసు మిస్టరీని పోలీసులు గురువారం ఉదయం ఛేదించారు. మహబూబాబాద్‌కు 5 కి.మీ దూరంలో ఉన్న ఓ గుట్ట ప్రాంతాంలో కాలిపోయిన స్థితిలో దీక్షిత్ రెడ్డి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మనోజ్‌రెడ్డి, సాగర్ సహా మొత్తం నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.  అయితే 9ఏళ్ల బాలుడి కిడ్నాప్, హత్య కేసులో ప్రధాన నిందితుడు బాబాయ్ వరుసయ్యే వ్యక్తి కావడం విచారకరం. పోలీసులు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించనున్నారు.

బాలుడు దీక్షిత్ రెడ్డి తండ్రి రంజిత్ రెడ్డికి, నిందితుడు మనోజ్ రెడ్డికి ఆర్థిక లావాదేవీలు, వ్యక్తిగత పరమైన వివాదాల నేపథ్యంలోనే ఈ హత్య జరగిందని తెలుస్తోంది. మహబూబాబాద్‌లోని కృష్ణ కాలనీలో ఆదివారం సాయంత్రం ఆరున్నర గంటలకు బైకుపై వచ్చిన కిడ్నాపర్లు దీక్షిత్ రెడ్డిని అపహరించారు. ఆ తర్వాత సమీపంలోని దానమయ్య గుట్ట ప్రాంతానికి తీసుకెళ్లిన అనంతరం రెండు గంటలలోపే బాలుడ్ని దారుణంగా హత్యచేశారు. ఆపై తమ వెంట తెచ్చిన పెట్రోల్‌తో దీక్షిత్ రెడ్డి మృతదేహానికి కిడ్నాపర్లు నిప్పంటించారు. దాదాపు 15 రోజుల ముందే ప్రధాన నిందితుడు మనోజ్ రెడ్డి కిడ్నాపర్లకు సుపారీ ఇచ్చాడని ప్రాథమికంగా తెలుస్తోంది.

 

ఇదిలాఉండగా, దీక్షిత్ రెడ్డిని కిడ్నాపర్లు రెండు గంటలలోపే హత్య చేయగా.. బాలుడి తల్లి వసంతకు కాల్ చేసి డబ్బులు డిమాంగ్ చేయడం గమనార్హం. అయితే మామూలుగా ఫోన్ నుంచి కాకుండా ఇంటర్నెట్ సాయంతో కాల్స్ చేశారు. దీంతో పోలీసులకు బాలుడి ఆచూకీ గుర్తించడం ఆలస్యమైంది. హైదరాబాద్ నుంచి టెక్నికల్ టీమ్ సైతం వెళ్లి లొకేషన్‌ను గుర్తించగా.. ఆ తర్వాతే దానమయ్య గుట్ట ప్రాంతానికి చేరుకుని నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారు చూపించిన ప్రాంతంలో పరిశీలించగా.. కాలిన స్థితిలో దీక్షిత్ రెడ్డి మృతదేహం కనిపించింది. 

 

మొత్తం 13 సార్లు కాల్ చేసిన నిందితులు
బాలుడి తల్లి వసంతకు కిడ్నాపర్లు మొత్తం 13 ఇంటర్నెట్ కాల్స్ చేసినట్లు సమాచారం. మీరు ఎవరని ప్రశ్నించగా.. గొంతుమార్చి మాట్లాడిన నిందితులు, మీకు బాబు కావాలా, సమాధానం కావాలా అని గద్దించారు. రూ.45 లక్షలు డిమాండ్ చేశారు. కోటి రూపాయాలు అయినా తెచ్చిస్తామని, కుమారుడు దీక్షిత్ రెడ్డిని మాత్రం ఏం చేయవద్దని తల్లి వసంత ప్రాధేయపడింది. కానీ నిందితులు కనికరించలేదు. మీ పిల్లాడిని క్షేమంగా అప్పజెబుతామని మాట ఇచ్చి మోసం చేశారు. కిడ్నాపైన రెండు గంటల్లోనే హత్య చేసిన నిందితులు దీక్షిత్ తల్లిదండ్రులు రంజిత్ రెడ్డి, వసంతలను మానసిక క్షోభకు గురిచేశారు. ఉద్దేశపూర్వకంగానే ఈ హత్య జరిగిందని పోలీసులు గుర్తించారు. డబ్బులు తీసుకుని పారిపోవాలని నిందితులు భావించారు. కానీ పోలీసుల నిఘా అధికం కావడంతో భయంతోనే దొరికిపోయారని తెలుస్తోంది. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News