హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం విరుచుకుపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... టీఆర్ఎస్ ప్రభుత్వం పని తీరుపై మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఉద్యమకారులను వ్యతిరేకించిన వాళ్లంతా ప్రస్తుతం కేసీఆర్కు మిత్రులుగా ఉన్నారని చెబుతూ పట్నం మహేందర్ రెడ్డిపై పలు సంచలన ఆరోపణలు చేశారు. ఉద్యమ సమయంలో తాండూరులో పట్నం మహేందర్ రెడ్డి సభను కూడా పెట్టుకోనివ్వకుండా అడ్డుపడ్డారని గుర్తుచేసుకుంటూ... రూ.5 కోట్లు పెడితే ఎమ్మెల్యే అవుతానని, ఆ తర్వాత మంత్రిని అవుతానని అప్పట్లో మహేందర్ రెడ్డి వ్యాఖ్యానించారని కోదండరాం ఆరోపించారు.
తెలంగాణ సర్కార్ వైఖరి గురించి మాట్లాడుతూ.. ''తెలంగాణ వచ్చాక ప్రజల బతుకులు మారుతాయనుకున్నాం కానీ కొత్త రాష్ట్రంలో కేసీఆర్ ఇల్లు ప్రగతి భవన్కు మారడం తప్ప ఇంకా ఎటువంటి మార్పు లేదు'' అని వ్యంగ్యస్త్రాలు సంధించారు. ఇది కేసీఆర్ తెలంగాణ కాదని, ప్రజలందరి తెలంగాణ అంటూ కేసీఆర్పై తీవ్ర పదజాలంతో మండిపడ్డారు.