Minister KTR Writes Letter To Amit Shah: కేంద్ర సీఆర్పీఎఫ్ ప్రభుత్వ ఉద్యోగాల కోసం కేవలం హిందీ, ఇంగ్లీష్ మాధ్యమంలో మాత్రమే పోటీ పరీక్షల నిర్వహిస్తున్న ప్రభుత్వ నిర్ణయాన్ని సమీక్షించుకోవాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. తాజాగా విడుదల చేసిన సీర్పీఎఫ్ జాతీయ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో కేవలం హిందీ, ఇంగ్లీష్ మాధ్యమాల్లో మాత్రమే పరీక్ష ఉంటుందని స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. సీఆర్పీఎఫ్ ఉద్యోగ సిబ్బంది నియామకం కోసం చేపడుతున్న ఈ పరీక్షను, తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళంతో పాటు గుర్తించిన అన్ని అధికారిక భాషల్లో నిర్వహించాలని కేంద్రాన్ని కేటీఆర్ డిమాండ్ చేశారు.
కేవలం హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మాత్రమే ఈ పోటీ పరీక్షలను నిర్వహించడం వలన తీవ్ర వివక్షత ఏర్పడుతుందని.. ముఖ్యంగా ఆంగ్ల మాధ్యమంలో చదవని వారు లేదా హిందీ ప్రాంతాలకు చెందని నిరుద్యోగ యువకులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందన్నారు. ఇప్పటికే వివిధ ఉద్యోగాల కోసం అనేక పరీక్షలు నిర్వహించే బదులు.. నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ద్వారా కామన్ ఎలిజిబిటీ టెస్ట్ విధానంలో 12 అధికారిక భాషల్లో పరీక్ష నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం గతంలో తీసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. అయితే ఈ నిర్ణయం సంపూర్ణంగా అమలు కావడంలేదన్నారు. తాజాగా సీఆర్పీఎఫ్ సిబ్బంది నియామకం కోసం విడుదల చేసిన నోటిఫికేషన్లో హిందీ, ఇంగ్లీష్ మాధ్యమాల్లోనే పరీక్ష అంటూ విధించిన పరిమితులను కేంద్ర మంత్రి అమిత్ షా దృష్టికి కేటీఆర్ తీసుకువచ్చారు.
అనేక అధికారిక భాషలు కలిగిన భారతదేశంలో కేవలం హిందీ వారికి మాత్రమే మాతృభాషలో పోటీ పరీక్షలు రాసే అవకాశం ఇవ్వడమంటే దేశ రాజ్యాంగ స్పూర్తికి పూర్తిగా విరుద్ధమన్నారు కేటీఆర్. దేశంలో రాజ భాష అంటూ ఏదీ లేదని రాజ్యాంగం స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం ప్రాంతీయ భాషలను పట్టించుకోకుండా కేవలం హిందీ, ఆంగ్ల మాధ్యమాల్లో ఉద్యోగాల భర్తీ పరీక్షలు నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. సమాన అవకాశాలు పొందేలా ఈ దేశ ప్రజలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కుని సీర్పీఎఫ్ నోటీఫికేషన్ కాలరాస్తుందని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలన్నింటిని అన్ని గుర్తించిన అధికారిక ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించాలని తమ ప్రభుత్వం కేంద్రాన్ని కోరిందన్న కేటీఆర్.. 2020 నవంబర్ 18న కేంద్ర ప్రభుత్వానికి సీఎం కేసీఆర్ లేఖ కూడా రాశారని గుర్తుచేశారు. ప్రాంతీయ భాషల్లో చదువుతున్న కోట్లాది యువకులకు ఎలాంటి వివక్ష, అసమానతలు లేకుండా సమాన అవకాశాలు దక్కేలా సీర్పీఎఫ్ నోటిఫికేషన్‌కు సవరణ చేయాలని అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు.
Also Read: Girl Swallows Mobile Phone: తమ్ముడితో గొడవ.. సెల్‌ఫోన్ మింగేసిన యువతి
Also Read: Covid-19 Cases In India: భారీగా పెరుగుతున్న కరోనా కేసులు.. ఆ రెండు రోజులు మాక్‌డ్రిల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి