IAF planes airlifted oxygen tankers: హైదరాబాద్: తెలంగాణలో ఆక్సీజన్ కొరతను అధిగమించేందుకు యుద్ధ విమానాల్లో ఖాళీ ఆక్సిజన్ ట్యాంకర్స్‌ని ఒడిశాకు పంపించారు. బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ఆక్సిజన్ ట్యాంకర్లతో బయల్దేరిన యుద్ధ విమానాలు ఒడిశా రాజధాని భువనేశ్వర్‌కు చేరుకున్నాయి. భువనేశ్వర్ నుంచి విమానాల ద్వారా 14.5 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రాష్ట్రానికి తీసుకురానున్నారు. యుద్ధ విమానాల్లో ఆక్సీజన్ ట్యాంకర్స్‌ని తీసుకురావడం ద్వారా మూడు రోజుల్లో పూర్తయ్యే పని ఒక్క రోజులోనే పూర్తవుతుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తెలిపారు. మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ సోమేష్ కుమార్ ఈ ఏర్పాట్లను స్వయంగా దగ్గరుండి సమీక్షించారు.
కరోనా సెకండ్ వేవ్ (Corona second wave) విజృంభించడం మొదలైన తర్వాత దేశవ్యాప్తంగా ఏర్పడిన ఆక్సీజన్ కొరతను అధిగమించేందుకు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు ఆక్సీజన్ తయారయ్యే పరిశ్రమల నుంచి కేటాయింపులు జరిపింది. అలా రాష్ట్ర ప్రభుత్వం విజ్ఙప్తి మేరకు కేంద్రం రాష్ట్రానికి 360 మెట్రిక్‌టన్నుల ఆక్సిజన్‌ను కేటాయించింది. అందులో 70 టన్నుల వరకు మన రాష్ట్రంలోనే అందుబాటులో ఉన్న చిన్నచిన్న పరిశ్రమల నుంచి రానుండగా... మిగిలిన ఆక్సిజన్‌ను బళ్లారి, భిలాయ్, అంగుల్ (ఒడిశా), పెరంబుదూర్ (తమిళనాడు) నుంచి కేటాయించింది.
వీటిలో తెలంగాణకు సమీపంలోని బళ్లారి స్టీల్ ప్లాంట్ నుంచి తెలంగాణకు 20 మెట్రిక్ టన్నుల ఆక్సీజన్ కేటాయించారు. అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ (Vizag steel plant) నుంచి కూడా దాదాపు అంతే మోతాదులో కేటాయింపులు జరిగాయి. ఇక వీటితో పోల్చితే దూర ప్రాంతాలైన భిలాయ్, పెరంబుదూర్, అంగుల్ నుంచి ఆక్సిజన్ (Oxygen supply to Telangana) సరఫరా చేసుకోవాలంటే కనీసం మూడు రోజుల సమయం పడుతుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్రం యుద్ధ విమానాల సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఇదిలావుంటే, యుద్ధ విమానాల ద్వారా ఆక్సీజన్ తరలింపు (Oxygen tankers supply) ప్రక్రియకు చొరవ చూపిన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు బీజేపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో వేగంగా వ్యాపిస్తున్న కరోనా సెకండ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు మోదీ సర్కారు తీవ్రంగా కృషి చేస్తోందని బండి సంజయ్ (Bandi Sanjay) తెలిపారు.