తెలంగాణ ముఖ్యమంతి కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. పాలన, రాజకీయ అంశాలు, ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల గురించి వీరిద్దరూ గంటకుపైగా చర్చించారు. అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. సీఎంకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడానికి కలిశానని అన్నారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ- "తెలంగాణ ప్రభుత్వం రైతులకు నిరంతర విద్యుత్ అందించడం అద్భుతమని.. సీఎం కేసీఆర్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని కొనియాడారు. రాత్రనక..పగలనక కష్టపడే రైతులకు ఎంతచేసినా తక్కువేనని, వారి సమస్యల పరిష్కారానికి చొరవ చూపి నిర్ణయం తీసుకున్న సీఎంకు అభినందనలు" అన్నారు. తెలంగాణలోని పాలనాతీరు, పథకాలను ఏపీలోనూ ప్రభుత్వం అమలుచేయాలని సూచించారు. ఈ విషయంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కాగా.. తెలుగురాష్ట్రాల్లో వీరిద్దరి భేటీ చర్చనీయాంశంగా మారింది. పవన్-కేసీఆర్ ములాఖత్ పై తెదేపా స్పందించాల్సి ఉంది.