Ponguleti Srinivas Reddy: ఈ మూడు నియోజకవర్గాలలో పొంగులేటి పోటీ ఎక్కడి నుంచి ?

Ponguleti Srinivas Reddy: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎక్కడ నుండి పోటీ చేస్తారో అనేదే ఆసక్తికరంగా మారింది. ఆయన అనుచరుల్లోనూ ఈ అంశంపైనే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటన కోసం వేచిచూస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కూడా అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనని శపథం చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంతకీ తానెక్కడి నుంచి పోటీచేస్తారనేదే ప్రస్తుతం ఒక హాట్ టాపిక్ అయింది. ఆ ఫుల్ డీటేల్స్ మీ కోసం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 18, 2023, 08:37 AM IST
Ponguleti Srinivas Reddy: ఈ మూడు నియోజకవర్గాలలో పొంగులేటి పోటీ ఎక్కడి నుంచి ?

Ponguleti Srinivas Reddy: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గత ఆరు నెలలపాటు సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ చేసిన విమర్శలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. పార్టీ మార్పుపై జరిగిన ప్రచారానికి కాంగ్రెస్‌లో చేరి ఆయన పుల్‌స్టాప్ పెట్టారు. అయితే ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎక్కడ నుండి పోటీ చేస్తారో అనేదే ఆసక్తికరంగా మారింది. ఆయన అనుచరుల్లోనూ ఈ అంశంపైనే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటన కోసం వేచిచూస్తున్నారు. ఖమ్మం ఉమ్మడి జిల్లాలోని మూడు జనరల్ స్థానాలు కొత్తగూడెం, పాలేరు, ఖమ్మం నియోజకవర్గాలు ఉండగా, ఈ మూడు ప్రాంతాల ప్రజలు తమ నియోజకవర్గాలోనే పోటీ చేయాలని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కోరుతున్నారు.

ఖమ్మం జిల్లాలో అనుచరగణం పుష్కలంగా ఉన్న నేతగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి పేరుంది. బీఆర్ఎస్ నుండి విభేదించి బయటకు వచ్చాక ఆ పార్టీ నుండి పెద్దసంఖ్యలో తన అనుచరులతో కలిసి రాహుల్ గాంధీ సమక్షంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే వచ్చే ఎన్నికల్లో మూడోసారి సీఎం కేసీఆర్‌ను అధికారంలోకి రానివ్వకుండా అడ్డుకుంటానని అనేక వేదికలపై  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఖమ్మం జిల్లాలో అయితే ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కూడా అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనని ఆయన శపథం కూడా  చేశారు. దీంతో జిల్లా రాజకీయాలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెంటే నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పోటీ చేసే స్థానంపై అందరి దృష్టి పడింది. 

ప్రధానంగా మొదటి నుండి కొత్తగూడెం అసెంబ్లీ స్థానం నుండి బరిలో నిలిచే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. పొంగులేటి తన అనుచరులకు ఆశిస్తున్న స్థానాలు పినపాక, ఇల్లందు, ఆశ్వారావుపేట నియోజకవర్గాలు కొత్తగూడెం జిల్లా పరిధిలోనే ఉన్నాయి. తాను కూడా కొత్తగూడెం అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసి ఆయా స్థానాలలో నిల్చున్న అభ్యర్థులను గెలిపించుకుంటే.. ఉమ్మడి జిల్లాలో పట్టు సాధించవచ్చానేది పొంగులేటి ఆలోచనగా తెలుస్తుంది. పైగా కొత్తగూడెం గతం నుండి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది. బీఆర్ఎస్ నుండి కూడా సరైన పోటీ ఉండదనేది ప్రచారంలో ఉంది. ఇక్కడ పోటీ చేస్తే గెలవడం ఖాయమనే ధీమాలో ఆయన ఉన్నట్లు సమాచారం. ఈక్రమంలో మొదటి నుండి కొత్తగూడెం నుండే పొంగులేటి పోటీ చేస్తారంటూ ఆప్రాంతవాసులు కూడా చర్చించుకుంటున్నారు. 

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బరిలో ఉంటాడని భావిస్తున్న మరొక నియోజకవర్గం పాలేరు.. గతంలో పొంగులేటి నిర్వహించిన ఆత్మీయ సమావేశాలలో తన‌ శిబిరం‌ నుండి అభ్యర్థిని ప్రకటించలేదు. దీంతో  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డినే పాలేరు నుంచి పోటీ చేస్తారని అంతా అనుకున్నారు. మరోపక్క వైఎస్ షర్మిళ ఇదే నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని ప్రకటించడంతో ఆమెకు మద్దతుగా  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  ఉంటారనే ప్రచారం కూడా జరిగింది. ఇప్పుడు షర్మిళ కూడా తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. అదే కానీ జరిగితే, కాంగ్రెస్ పార్టీ నుండి ఆమె బరిలో ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.. అలా జరగకపోతే  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా కూడా ఉండవచ్చు అనేది ఆ ప్రాంతం వాసుల అభిప్రాయంగా ఉంది.  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేస్తే గెలిపించుకుంటామని ఆ పార్టీ శ్రేణులు ఇప్పటికే పొంగులేటికి స్పష్టం చేశారట.

ఇక ఖమ్మం నియోజకవర్గంలోను  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బరిలో ఉండాలని ఆయన అనుచరులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా కేంద్రంగా ఉండే ఖమ్మంలోనే పొంగులేటి పోటీ చేయాలని కొంతకాలంగా ఆయనపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. మరోవైపు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ను ఢీ కొట్టాలంటే పొంగులేటే సరైన అభ్యర్థి అనే టాక్ కూడా వినిపిస్తోంది. గత కొంతకాలంగా ఖమ్మంలోనే  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పోటీ చేయాలని ఆయన ప్రధాన అనుచరులు తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి స్థిరమైన ఓటు బ్యాంక్ ఉంది. పొంగులేటి కనుక పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉంటుందని ఆపార్టీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

కాంగ్రెస్ పార్టీ కూడా  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఖమ్మం బరిలో నిలపాలనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అయితే మంత్రి పువ్వాడపై బచ్చాగాన్నయినా పెట్టి గెలిపిస్తానని  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. మంత్రిగా పువ్వాడ అజయ్ ఖమ్మంలో మంచి పట్టు సాధించారు. నగరాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేశారన్న పేరుంది. అన్ని వర్గాల ప్రజలతో మమేకమై కలిసిపోయే వ్యక్తిగా పువ్వాడను చెప్పుకుంటారు. ఖమ్మంలో మంత్రిపై పొంగులేటి పోటీ చేస్తే నువ్వా నేనా అనే పోటీ నెలకొనే పరిస్థితులు ఉంటాయి. ఈ అంశాలన్నీ గమనిస్తున్న  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మంలో పోటీ చేయాలా.. లేక తన అనుచరులను బరిలో నిలపాలా అనే మీమాంసలో ఉన్నారు..

అయితే కాంగ్రెస్ అధిష్టానం ఈ మూడు నియోజకవర్గాలలో ఎక్కడ నుండి పోటీ చేయమని చెప్పినా చేస్తానని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఏది ఏమైనా పార్టీ అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అంటున్నారు పొంగులేటి.. మరి ఏ నియోజకవర్గం నుండి ఆయన ఉంటాడో వేచి చూడాల్సిందే.

Trending News