దిశ కేసులో ఎన్‌కౌంటర్‌పై పౌర హక్కుల నేత హరగోపాల్ స్పందన

దిశపై అతి కిరాతకంగా సామూహిక అత్యాచారం జరిపి, ఆమెను దారుణంగా హత్య చేసిన నిందితులు సైబరాబాద్ పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమవడం సంచలనం సృష్టించింది. దేశవ్యాప్తంగా పతాక శీర్షికలకెక్కిన ఈ ఘటనపై ప్రజల్లో హర్షాతీరేకాలు వ్యక్తమవుతున్నాయి.

Updated: Dec 6, 2019, 08:30 PM IST
దిశ కేసులో ఎన్‌కౌంటర్‌పై పౌర హక్కుల నేత హరగోపాల్ స్పందన

హైదరాబాద్: షాద్ నగర్ సమీపంలో దిశపై అతి కిరాతకంగా సామూహిక అత్యాచారం జరిపి, ఆమెను దారుణంగా హత్య చేసిన నిందితులు సైబరాబాద్ పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమవడం సంచలనం సృష్టించింది. దేశవ్యాప్తంగా పతాక శీర్షికలకెక్కిన ఈ ఘటనపై ప్రజల్లో హర్షాతీరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయమై ప్రముఖ సామాజికవేత్త ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ.. ఎవరైనా సరే నిగ్రహం కోల్పోవడం సరికాదని అన్నారు. సమాజంలోని ప్రతీ ఒక్కరూ సంయమనం పాటించాల్సిన అవసరం ఉందని చెప్పారు. చట్టాన్ని కాదని శిక్షలు వేస్తే కొంత న్యాయం జరిగిందని భావించవచ్చేమో కానీ.. ఎన్‌కౌంటర్లు చేస్తే సమాజంలో తప్పుడు సంకేతాలు వెళ్తాయని అన్నారు. దిశ హత్య అత్యంత ఘోరమైన ఘటనేనని... అయితే అలాగని కేవలం ప్రజల ఆగ్రహావేశాలను ఆధారంగా చేసుకొని ఎన్‌కౌంటర్ చేయడం మాత్రం సరైందికాదని ప్రొఫెసర్ హరగోపాల్ అభ్యంతరాలు వ్యక్తంచేశారు. అయితే, ఇలాంటి ఘటనల్లో కోర్టులో నేరాన్ని రుజువు చేసిన అనంతరం అత్యంత కఠినమైన శిక్షలు అమలు చేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలు కోరుకుంటున్నారు కదా అనే ఉద్దేశంతో ఎన్‌కౌంటర్లు చేయడం సరైంది కాదని ప్రొఫెసర్ హరగోపాల్ హితవు పలికారు. 

ఇదిలావుంటే, ఇదే ఎన్‌కౌంటర్‌పై జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖా శర్మ స్పందిస్తూ.. సగటు పౌరురాలిగా ఈ ఎన్‌కౌంటర్ వార్త చూసి తాను సంతోషపడ్డాను. ఈ కేసులో నిందితులకు వీలైనంత త్వరగా శిక్ష పడాలనే జాతీయ మహిళా కమిషన్ కోరుకుందని.. అయితే, ఆ శిక్ష చట్టపరమైన శిక్ష అయ్యుండాలని భావించామే కానీ ఇలా కాదని అన్నారు.