Ramannapeta Real Story: గుడి లేదు, బడి లేదు.. రోడ్డు లేదు.. తాగడానికి నీరూ లేదు.. ఖాళీ అవుతున్న ఓ ఊరి కథ

Ramannapeta, A Village without Road, Drinking Water, School: ఇప్పుడు ఆ ఊరికి అర్జెంటుగా ఒక శ్రీమంతుడు కావాలి... ఆ పల్లెను అభివృద్ధి చేయాలి.. ఇదేదో సినిమా స్టోరీల తలపిస్తుందేననే సందేహాంగా ఉందా.... అలాంటిదేం లేదు. చూడ్డానికి, వింటానికి అచ్చు సినిమా కథలా ఉన్నప్పటికీ.. అచ్చమైన రియల్ స్టోరీనే అంటే నమ్ముతారా.. అవును.. ఎవరు నమ్మినా.. నమ్మకపోయినా ఇది నూటికి నూరు శాతం నిజమైన కన్నీటి గాథే. ఆ గ్రామస్తులు తమ కన్నీటి గాథను జీ తెలుగు న్యూస్‌తో పంచుకున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 21, 2023, 06:19 AM IST
Ramannapeta Real Story: గుడి లేదు, బడి లేదు.. రోడ్డు లేదు.. తాగడానికి నీరూ లేదు.. ఖాళీ అవుతున్న ఓ ఊరి కథ

Ramannapeta, A Telangana Village without Road, Drinking Water, School: ఏంటి ఈ రోజుల్లో ఇంకా గుడి, బడి లేని గ్రామాలు ఉన్నాయా అని ఆశ్చర్యపోతున్నారా ? అయితే ఈ ఊరికి గుడి, బడి మాత్రమే కాదు.. ఇప్పటికీ కనీసం రోడ్డు సౌకర్యం, మంచి నీటి వసతి కూడా లేవని చెబితే ఇంకేమంటారో చెప్పండి. అవును.. మీరు చదివింది నిజమే.. ఈ ఊరికి గుడి, బడే కాదు.. చెప్పుకోదగిన కనీస సౌకర్యం అంటూ ఏదీ లేదు. జీవించడానికి సరిపడా ఆదాయ వనరులు లేక ఒక్కొక్కరుగా ఊరు విడిచి బతుకుదెరువు కోసం పట్నంబాట పట్టి వలస వెళ్లిపోతున్నారు.. ఒకప్పుడు 100 కుటుంబాలు నివాసం ఉన్న ఈ ఊరిలో.. ఇప్పుడు 25 కుటుంబాలు మాత్రమే జీవిస్తున్నాయి. 

ఇప్పుడు ఆ ఊరికి అర్జెంటుగా ఒక శ్రీమంతుడు కావాలి... ఆ పల్లెను అభివృద్ధి చేయాలి.. ఇదేదో సినిమా స్టోరీల తలపిస్తుందేననే సందేహాంగా ఉందా.... అలాంటిదేం లేదు. చూడ్డానికి, వింటానికి అచ్చు సినిమా కథలా ఉన్నప్పటికీ.. అచ్చమైన రియల్ స్టోరీనే అంటే నమ్ముతారా.. అవును.. ఎవరు నమ్మినా.. నమ్మకపోయినా ఇది నూటికి నూరు శాతం నిజమైన కన్నీటి గాథే. ఆ గ్రామస్తులు తమ కన్నీటి గాథను జీ తెలుగు న్యూస్‌తో పంచుకున్నారు. ఇంతకీ ఎవరో ఒక శ్రీమంతుడి కోసం ఎదురుచూస్తోన్న ఆ గ్రామం ఎక్కడ ఉంది.. అసలు ఆ గ్రామస్తుల సమస్యలు ఏంటో తెలుసుకుందాం రండి.

అది మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం రామన్నపేట గ్రామం. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఈ పల్లెటూరిలో రోడ్లు, నీటి సదుపాయాలే కాదు.. కనీసం గుడి, బడి కూడా లేదు. దీంతో వీరి జీవితానికి కనీస వసతులు అందని ద్రాక్షగానే మారుతున్నాయి. ఒకప్పుడు ఊళ్ళో సుమారు 100 కుటుంబాలు ఉండేవి.. గుట్టల మధ్య ఉన్న ఈ గ్రామంలో జీవనానికి సరిపడ ఆర్థిక వనరులు లేకపోవడంతో ఒక్కొక్కరిగా... ఒక్కో కుటుంబం పనుల కోసం పట్నం బాట పట్టింది. దీంతో ఒకప్పుడు 100 కుపైనే కుటుంబాలు ఉన్న ఈ గ్రామం ఇప్పుడు 25 కుటుంబాలకే పరిమితమైంది. 

పరిస్థితి ఇలానే కొనసాగితే చివరికి ఊరికి ఊరే ఖాళీ అవుతుందని గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు. ఏన్నో ఏళ్ళుగా కలిసి మెలిసి... కష్టసుఖాలను పాలుపంచుకున్నామని ఇప్పుడు ఒక్కొక్కరిగి ఊరు విడిచి వెళ్తుంటే బాధగా ఉందని... అలా బతుకుదెరువు కోసం బతుకుజీవుడా అని ఊరు విడిచి వెళ్లే వారిని ఆపే ప్రయత్నం చేసినా.. ఇక్కడే ఉండి పస్థులుండి చావాలా అంటూ బరువెక్కిన గుండేతో కుంగిపోతున్నారు అని గ్రామస్తులు తమ కన్నీటి గాథను వెలిబుచ్చారు.  

అప్పుడప్పుడు అధికారులు, ప్రజాప్రతినిధులు మొక్కుబడిగా వచ్చి చూసి పోతారే తప్ప పట్టించుకున్న పాపానా పోలేదని రామన్నపేట గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగినా.. గర్భిణి స్త్రీలకు పురుటి నొప్పులొచ్చినా.. అత్యవసరంగా ఆసుపత్రికి తరలిద్దామంటే కనీసం 108 అంబులెన్స్ వచ్చేందుకైనా సరైన రోడ్డు మార్గం లేక అంబులెన్స్ కూడా రాలేని దుస్థితి నెలకొందని తమ కష్టాలను జీ తెలుగు న్యూస్ తో ఏకరువు పెట్టారు. పిల్లలు చదువుకోవాలంటే వారికి కనీసం ఏడేళ్ళు వచ్చే వరకు వేచిచూడాల్సిందే. ఎందుకంటే సుమారు నాలుగైదు కిలోమీటర్ల దూరం పంట పొలాల వెంట, గుట్టలపై నడుచుకుంటూ వెళితేనే కాచనపల్లి అనే గ్రామంలో ప్రభుత్వ పాఠశాలకు చేరుకోవచ్చు. అలా వెళ్లేంత వయస్సొచ్చేకా ఇక్కడి పిల్లలు బడి బాట పట్టేది. 

గతంలో రామన్నపేట కొత్తగూడెం గ్రామపంచాయతీలో ఉండేది. ఇప్పుడది కాచనపల్లి గ్రామపంచాయతీలో కలవడంతో ఇంకా మూడు నాలుగు కిలోమీటర్ల దూరం పెరిగింది. అభివృద్ధి కోసమని అధికారులను, ప్రజాప్రతినిధులను ఎంత వేడుకున్నా.. మాపై కనికరం చూపట్లేదని... ఎవరైనా శ్రీమంతులు మా గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధికి బాటలు వేసి...వలసలను ఆపాలని వారు ప్రాధేయపడుతున్నారు. ఎన్నికలకు ముందు ఏదో ఒక పేరుతో సమ్మేళనాలు, సమావేశాలు పెట్టి, మేం ఇది చేశాం.. అది చేశాం అని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే నాయకుల కంటికి ఇలాంటి రామన్నపేటలు కనిపించకపోవడం నిజంగా విడ్డూరం. కొరటాల శివ రాసుకున్న రీల్ స్టోరీలో ఊరిని బాగుచేసిన శ్రీమంతుడు ఉన్నాడు.. కానీ రామన్నపేట వాసుల రియల్ స్టోరీలో అంతా వలస జీవులే తప్ప వారి కన్నీటిని తుడిచేలా యే శ్రీమంతుడూ లేడు.

Trending News