కూటమికి రెబల్స్ బెడద ; దారికొస్తారా ?..దెబ్బతీస్తారా ?

                          

Last Updated : Nov 13, 2018, 09:29 PM IST
కూటమికి రెబల్స్ బెడద ; దారికొస్తారా ?..దెబ్బతీస్తారా ?

మహాకూటమిలో సీట్ల కేటాయింపుపై కసరత్తు పూర్తికావడంతో కూటమికి రెబల్స్ సెగ తాకింది. టికెట్ వస్తుందని ఎదురుచూసిన ఆశావహులు కాస్త అసంతృప్తి వాదులుగా మారిపోయారు. తమకు టికెట్ రాకపోతే తిగురుబాటు బావుట ఎగురవేస్తామంటున్నారు. పార్టీకి సేవ చేసింది ఇందుకే అని తమ నాయకులను నిలదీస్తున్నారు. మహాకూటమిలో పార్టీల వారీగా రెబల్స్ వివరాలను ఒకసారి పరిశీలిద్దాం..

* కాంగ్రెస్  తొలి జాబితా ప్రకటించగానే పొన్నాల, మర్రిశశిధర్ రెడ్డి సహా కొందరు సీనియర్లు అధిష్టానం తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలి జాబితాలో తమ పేర్లు లేకపోవడంపై అధిష్టానం వద్దే తేల్చుకుంటామని ఫైర్ అయ్యారు. ఇక సీట్లు ఆశించిన ఆశావహులు 11 మంది రెబల్స్ పార్టీ ధిక్కార స్వరం వినిపించారు. వీరిలో వరంగల్ వెస్ట్ నుంచి టికెట్ ఆశించిన నాయని రాజేందర్ రెడ్డి ఉన్నారు. మహాకూటమిలో భాగంగా ఆ సీటు టీడీపీకి కేటాయిచండంతో ఆయన మండిపడుతున్నారు. ఇక ఉపేక్షించేది లేదని..తనదారి తాను చూసుకుంటానని వార్నింగ్ ఇచ్చారు. ఇక శేర్ లింగపల్లి కాంగ్రెస్ నేత బీక్షపతి యదవ్ సొంత పార్టీపై తీవ్ర ఆగ్రహం చేస్తున్నారు. మహాకూటమిలో భాగంగా ఈ సీటు టీడీపీకి కేటాయించడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అలాగే సికింద్రాబాద్ కంటోర్మెంట్ పరిస్థితి పూర్తిగా భిన్నం. ఆ సీటుకు మామ సర్వే సత్యరాణకు ఇవ్వడంపై అల్లుడు క్రిషాంక్ ఆగ్రహం. పార్టీ కోసం కష్టపడిన తనకు ఇవ్వకపోతే తాను ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతామని హెచ్చరించారు.

* రెబల్స్ బెడద టీడీపీని కూడా తాకింది. ఆ పార్టీలో నలుగురు అభ్యర్ధులు తిరుబాటు చేస్తున్నారు. తమకు టికెట్ రాకపోతే తిగురుబాటు బావుట ఎగురవేస్తామంటున్నారు. శేర్ లింగంపల్లి టికెట్ ఆశించిన టీడీపీ నేత మువ్వా సత్యనారాయణ్ తనకు సీటు ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఆయన అనుచరులు  ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ దగ్గర ధర్నా చేశారు. ఓ కార్యకర్త పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.వాస్తవానికి ఆ టికెట్ టీడీపీకి దక్కినప్పటికీ మువ్వా సత్యనారాయణ్ ను కాదని ఓ పారిశ్రామిక వేత్తకు ఇచ్చారు. దీంతో మువ్వా సత్యనారాయణ తిరుగుబాటు చేశారు. ఇక కొత్తగూడెం నుంచి టీడీపీ అభ్యర్ధి కోనేరు చిన్ని రెబల్ గా పోటీ చేస్తానంటున్నారు. ఈ సీటు కోసం సీపీఐ ఒత్తిడి తెచ్చినా కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది. ఈ సీటు కోసం కాంగ్రెస్, సీపీఐ లు పోటీ పడినప్పటికీ టీడీపీ అధిష్టానం తమకు కావాలని కోరకపోవడంపై ఆయన మండిపడుతున్నారు. తాను ఇండిపెండెంట్ గానైనా పోటీ చేసి గెలుస్తానంటున్నారు కోనేరు చిన్ని. కాగా ఇదే బాటలో కోదాడ నుంచి మల్లయ్యయాదవ్, ఎల్ బీ నగర్ నుంచి సామరంగారెడ్డి రెబల్స్ గా తెరపైకి వస్తున్నారు. 

టీజేఎస్, సీపీఐలో రెబల్స్ బెడద లేదనే చెప్పాలి. ఇప్పటి వరకు ఎవరూ తెరపైకి రాలేదు.  ఇదిలా ఉండగా రెబల్స్ ను బుజ్జగించేందుకు టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు తలపట్టుకుంటున్నాయి. రెబల్స్ ను బుజ్జగించేందుకు పార్టీలు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాయి. దీంతో రెబల్స్ దారికొస్తారా ? పార్టీని దెబ్బతీస్తారా ? అనే దానిపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. రెబల్స్ గనుక తిరుగుబాటు చేస్తే మహాకూటమి ఆశలపై నీళ్లు చల్లినట్లేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Trending News