Jaggareddy Interesting Comments: సీఎం కేసీఆర్‌ని కలిస్తే తప్పేంటన్న జగ్గారెడ్డి

Jaggareddy Interesting Comments on Meeting KCR: సంగారెడ్డిలో అంగన్వాడీ వర్కర్స్ ధర్నా సందర్భంగా వారికి సంఘీభావం ప్రకటిస్తూ ధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను సీఎం కేసీఆర్‌ని కలిసిన మరుక్షణం నుండే తాను పార్టీ మారుతున్నట్లు లేనిపోని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నది, లేనట్టు.. లేనిది, ఉన్నట్టు పుకార్లు షికార్లు చేస్తాయని.. కొంతమంది పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 4, 2023, 05:03 AM IST
Jaggareddy Interesting Comments: సీఎం కేసీఆర్‌ని కలిస్తే తప్పేంటన్న జగ్గారెడ్డి

Jaggareddy Interesting Comments on Meeting KCR : సంగారెడ్డి: సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఏం మాట్లాడినా ఆ వ్యాఖ్యలు వైరల్ అవడం సాధారణమైంది. ముఖ్యంగా జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీలోంచి బీఆర్ఎస్ పార్టీలోకి జంప్ అవుతున్నారా అనే కోణంలో ఎన్నో ఊహాగానాలు వచ్చాయి. తాజాగా ఇదే విషయమై జగ్గారెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డిలో అంగన్వాడీ వర్కర్స్ ధర్నా సందర్భంగా వారికి సంఘీభావం ప్రకటిస్తూ ధర్నాలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ, అంగన్వాడీ కార్యకర్తల సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే సీఎం కేసీఆర్ వద్దకు వెళ్లి కలుస్తానని.. తప్పకుండా అంగన్వాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. అయితే, తాను సీఎం కేసీఆర్‌ని కలిసిన మరుక్షణం నుండే తాను పార్టీ మారుతున్నట్లు లేనిపోని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నది, లేనట్టు.. లేనిది, ఉన్నట్టు పుకార్లు షికార్లు చేస్తాయని.. కొంతమంది పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనందున ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే వారిని కలవక తప్పదని.. అంతమాత్రాన్నే తాను పార్టీ మారుతున్నానని దుష్ప్రచారం చేస్తే ఎలా అని ఆవేదన వ్యక్తంచేశారు. సమస్యల పరిష్కారం కోసం తాను ముఖ్యమంత్రిని కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. అంతటితో ఊరుకోని జగ్గారెడ్డి.. అయినా సీఎం కేసీఆర్‌ను విమర్శిస్తే లాభం లేదని.. సమస్యల పరిష్కారమే ముఖ్యం అని వ్యాఖ్యానించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. 

జగ్గారెడ్డి కావాలనే అలా అన్నారా ?
జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలోకి మారుతారంటూ ఏడాది, రెండేళ్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం, రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న జగ్గారెడ్డి.. పార్టీ మారడానికి సరైన సమయం కోసం వేచిచూస్తున్నారనే కామెంట్స్ వినిపించాయి. ఆ సమయం వచ్చే వరకు ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారు అనేది ఆ ప్రచారం సారాంశం. ఇలాంటి కామెంట్స్ వినిపిస్తున్న తరుణంలోనే ముఖ్యమంత్రిని కలిస్తే తప్పేంటని ఒకసారి.. ముఖ్యమంత్రిని విమర్శించి లాభం లేదని మరోసారి వ్యాఖ్యానించడం వెనుక ఆంతర్యం ఏంటనే సందేహాలు కలుగుతున్నాయి. ఒకవేళ భవిష్యత్తులో తాను వెళ్లి సీఎం కేసీఆర్‌ని కలిసినా.. సమస్యల పరిష్కారం కోసమే కలిశానే తప్ప మరో కారణం లేదని కలరింగ్ ఇవ్వడం కోసమే ముందు జాగ్రత్త చర్యగా అలా కామెంట్ చేశారా అనే టాక్ వినిపిస్తోంది.

Trending News