హైదరాబాద్: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులకు సంబంధించిన రెండో జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. అయితే జాబితాలో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పేరు లేదు. తొలి జాబితాలో తన పేరు లేకపోవడంపై షాక్ కు గురైన మాజీ మంత్రి పొన్నాలకు ..మరో షాక్ తగినట్లయింది. రెండో జాబితాలో కూడా తన పేరు లేకపోవడంతో ఆయన దిగ్భ్రాంతికి గురయ్యారు. జాబితాలో పేరులేకపోవడంపై అధిష్టానం వద్దే తేల్చుకునేందుకు సిద్ధమైన క్రమంలో రెండో జాబితా విడుదల చేయడం.. ఆయన పేరు లేకపోవడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీంతో ఇప్పుడు పొన్నాల ఎలా స్పందిస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. ఉమ్మడి రాష్ట్రంలో నీటి పారుదలశాఖ మంత్రిగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఆయన తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఇంతటి కీలక పాత్ర పోషించిన పొన్నాలకు ఇలాంటి గడ్డుపరిస్థితి రావడం చర్చనీయంశంగా మారింది.
వాస్తవానికి పొన్నాల జనగామ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. అయితే ఆ సీటు టీజేఎస్ కు కేటాయించి కోదండరాంను బరిలోకి దించాలని మహాకూటమి భావిస్తోంది. అయితే దీనిపై పొన్నాల ప్రతిఘటించడంతో ఇప్పటి వరకు ఆ సీటు వ్యవహారం తేల్చలేదు. అయితే పొన్నాల మాత్రం జనగామ సీటు తనదేనని బల్లుగుద్ది చెబుతున్నారు. కాంగ్రెస్ తుది జాబితాలోనైనా న్యాయం జరుగుతుందని పొన్నాల అనుచరవర్గం ఆశతో ఎదురుచూస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో జనగామ సీటు ఎవరికి వరిస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.
కాంగ్రెస్ రెండో జాబితాలోనూ పొన్నాలకు మొండి చేయి !