స్థానిక ప్రజాప్రతినిధుల లంచాల బాగోతాన్ని బయటపెట్టిన వీడియో

ప్రజా ప్రతినిధులకు లంచం ఇవ్వాలని రాజ్యాంగంలో ఎక్కడైనా రాసిపెట్టి వుందా ?

Last Updated : Mar 18, 2018, 04:13 PM IST
స్థానిక ప్రజాప్రతినిధుల లంచాల బాగోతాన్ని బయటపెట్టిన వీడియో

ప్రజా ప్రతినిధులకు లంచం ఇవ్వాలని రాజ్యాంగంలో ఎక్కడైనా రాసిపెట్టి వుందా ? కాంట్రాక్ట్ పనులు చేసే కాంట్రాక్టర్లు ఆ ప్రాంతానికి చెందిన స్థానిక ప్రజా ప్రతినిధులకు పర్సెంటేజ్‌ల లెక్కన మామూళ్లు ఇవ్వందే వాళ్లకు ప్రభుత్వం నుంచి బిల్లులు మంజూరు కావా ? ఎన్నికల సమయంలో ఓటర్లపై లక్షలు, కోట్లు కుమ్మరించి గెలిచే ప్రజాప్రతినిధులు తిరిగి కాంట్రాక్టుల రూపంలో ఆ సొమ్మును రాబట్టుకోవచ్చు అని మంత్రులు వారికి అధికారికంగా వెసులుబాటు కల్పిస్తున్నారా ? స్థానిక ప్రజా ప్రతినిధులకు ఒకటో లేక రెండో పర్సెంటేజ్‌లో అమ్యమ్యాలు ముట్టజెప్పాలని స్వయంగా మంత్రులే కాంట్రాక్టర్లకు సూచిస్తున్నారా ? ఇదిగో సిరిసిల్ల మునిసిపల్ కౌన్సిల్ మాజీ చైర్ పర్సన్ సామల పావని స్వయంగా మీడియా ముందు కూర్చుని మరీ ఇస్తున్న ఈ స్పీచ్ వింటే మీకు కూడా ఇవే డౌట్స్ కలగకమానవు. 

 

అన్నట్టు సామల పావని ఈ వ్యాఖ్యలు చేసేంత వరకు ఆమె సిరిసిల్ల మునిసిపల్ చైర్‌పర్సన్ కుర్చిలోనే వున్నారు. కానీ అవగాహనారాహిత్యంతో చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యలే ఆమెను ఆ పదవికి దూరం చేశాయి. సిరిసిల్ల మునిసిపాలిటీకి మాజీ చైర్‌పర్సన్ అయ్యేలా చేశాయి. అవును, ఈ ప్రెస్‌మీట్ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవడంతో మంత్రిగారు నాలుగు అక్షింతలే వేశారో.. లేక పార్టీ పరువు తీశావు అని పెద్దలే గట్టిగా గద్దించారో తెలియదు కానీ ఆమె మాత్రం తన వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నాను అని పేర్కొంటూ సిరిసిల్ల మునిసిపల్ కమిషనర్‌కి తన రాజీనామా లేఖను పంపించారు. 

ప్రజాప్రతినిధులు జవాబుదారీతనంతో నడుచుకోవాలని, ప్రాంతీయ అభివృద్ధి విషయంలో ఒకరిపై మరొకరు అన్నట్టుగా పోటీపడాలని తరచుగా చెప్పే మంత్రి కేటీఆర్ సొంత నియోజకవర్గంలో, అది కూడా ఆయన చేతిలో వున్న మునిసిపల్ శాఖ విషయంలోనే ఇలాంటి ఘటన వెలుగుచూడటం విడ్డూరంగా వుందంటున్నాయి ప్రతిపక్షాలు.  

Trending News